అమరావతి: ఏపి ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలి చూస్తుంటే ఆయనకు ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఏమాత్రం గౌరవం లేనట్లుగా ఉందని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడటానికే ఆయన ఇష్టపడుతున్నారని, అందుకుతార్కాణం నిన్న(బుధవారం) జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలేనని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒకనెలలో రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని, వాటిలో నూటికి 90శాతం మనమే గెలిచితీరాలని చెప్పడం, ఎక్కడైనా ఓడితే మంత్రులంతా ఇంటికేనని, ఫలితాలు ప్రతికూలంగా వస్తే మంత్రులంతా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామాలు ఇవ్వాలని హెచ్చరించాడని  అన్నారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలకు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవంటూ బెదిరింపు ధోరణితో వ్యవహరించాడన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకముందా అని...  ప్రజాస్వామ్యాన్ని చంపేయాలని భావిస్తున్నట్లుగా ఉందని రామయ్య అభిప్రాయపడ్డారు. 

ఎటువంటి గొడవలు, హింసాత్మక సంఘటనలు లేకుండా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిపించాల్సిన బాద్యత మంత్రులపైనే ఉందని చెప్పాల్సిన ముఖ్యమంత్రే అందుకు విరుద్ధంగా మాట్లాడితే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓడితే మంత్రులకు మూడినట్లేనని ముఖ్యమంత్రి చెప్పడం ద్వారా వారికి ఆయన ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. సీఎం అలా మాట్లాడాక మంత్రులంతా ఎన్నికల్లో గెలవడం కోసం ప్రతిపక్షపార్టీలను భయభ్రాంతులకు గురిచేయడం, బూత్ లు క్యాప్చర్ చేయడం, భయానక చర్యలకు పాల్పడటం వంటి పనులు చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. 

read more   జగన్ కూడా కిరణ్ కుమార్ రెడ్డిలా చేయాల్సింది: చంద్రబాబుతో భేటీ తర్వాత సిపిఐ రామకృష్ణ

ఏంచేసైనా సరే గెలవాలని, గెలుపే లక్ష్యమని ముఖ్యమంత్రే చెబితే, ప్రభుత్వ యంత్రాంగం మంత్రిమండలిని కాపాడకుండా ఉంటుందా అని వర్ల సందేహం వ్యక్తంచేశారు. పోలీసులు చట్టప్రకారం విధులు నిర్వర్తిస్తారా, ఎన్నికల విధులు నిర్వర్తించేవారంతా పక్షపాతం లేకుండా పనిచేస్తారా అని రామయ్య ప్రశ్నించారు. పార్టీ సమావేశాల్లో మాట్లాడినట్టుగా మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రే మాట్లాడటం చూస్తుంటే రాష్ట్రంలో మరేపార్టీ బతికి బట్టకట్టకూడదన్న వైఖరిఆయనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 

ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలని చెప్పడంద్వారా ముఖ్యమంత్రి ఎంత ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని అవమానించారో స్పష్టంగా అర్థమవుతోందన్నారుఎన్నికలు ప్రజాస్వామ్య హితంగా నిర్వహించరా...? అని ప్రశ్నించారు. మంత్రిమండలిలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానాలు సుమోటాగా స్వీకరించి వెంటనే ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వర్ల విజ్ఞప్తి చేశారు. 

బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవ్యక్తే అలా మాట్లాడటం స్థానిక సంస్థల ఎన్నికలను ఆయన ప్రజాస్వామ్యహితంగా నిర్వహించడానికి సిద్ధంగాలేరని తేలిపోయిందన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రే అరాచకం సృష్టించండి, ఎన్ని ప్రలోభాలైనా పెట్టండ గెలుపే లక్ష్యంగా పనిచేయండంటే న్యాయస్థానాలు తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిందేనన్నారు. న్యాయస్థానాలు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా సీఎం వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని రామయ్య విజ్ఞప్తిచేశారు. 

read more   ఆ ఉద్యోగులను స్థానికసంస్థల ఎన్నికలకు దూరంగా వుంచండి...: సీఈసీకి టిడిపి ఫిర్యాదు

ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమనేది కూడా గ్రహించకుండా బానిసలను ఆదేశించినట్లుగా జగన్మోహన్ రెడ్డి తన సహచరమంత్రులను, శాసనసభ్యులను ఆదేశించాడన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రాన్ని ఐదుజోన్లుగా విభజించిన ప్రభుత్వం అయిదుగురు ఇన్ ఛార్జ్ లను నియమించిందన్న వర్ల, ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి, ఉభయగోదావరి జిల్లాలకు వైవీ.సుబ్బారెడ్డి, కృష్ణా-గుంటూరుకు అయోధ్య రామిరెడ్డి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనంతపురం,చిత్తూరు, కడపకు సజ్జల రామకృష్ణారెడ్డి లను నియమించారన్నారు. ప్రభుత్వం నియమించిన ఐదుగురు నేతలు ఎందులో నిష్ణాతులో, పాలనలో వారికున్న అనుభవమేమిటో ముఖ్యమంత్రి  చెప్పాలన్నారు.

విజయసాయిరెడ్డి బెదిరింపుల్లో నిష్ణాతుడని, ఆయనెక్కడ అడుగుపెడితే అక్కడ ఎవరైనాసరే గజగజ వణకాల్సిందేనని, అదేవిధంగా వై.వీ.సుబ్బారెడ్డి ప్రలోభాల్లో, ఎదుటివారిని మాయచేయడంలో నిష్ణాతుడని వర్ల పేర్కొన్నారు. అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లు తన బలంతో, తమకున్న అధికారబలంతో ఎంతటి వారినైనా కొనుగోలు చేయడంలో మంచిసిద్ధహస్తులని, చివరిగా చెప్పుకోవాల్సింది సజ్జల గురించేనన్నారు. జగన్ కు చెందిన సాక్షి సంస్థకు చెందిన వాహనాల్లో డబ్బులు, మద్యం తరలించడం, పార్టీకి చెందిన సమాచార వ్యవస్థలను బలోపేతం చేయడంలో సజ్జలను మించినవారు లేరన్నారు. 

బలహీన వర్గాలకు న్యాయం చేస్తానంటున్న ముఖ్యమంత్రి, ఎన్నికల నిర్వహణ భారం మొత్తం ఐదుగురు పెద్దరెడ్లకే అప్పగించడంలోని ఆంతర్యమేమిటో ఇప్పటికైనా రాష్ట్రప్రజలంతా గమనించాలని రామయ్య హితవుపలికారు. తనచర్యలతో మిగతావర్గాలు పనికిరారని జగన్ చెప్పకనే చెప్పాడన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ముఖ్యమంత్రి, ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆలోచించాలని, పాలనాయంత్రాంగం మొత్తం సీఎం ఆదేశాలను పట్టించుకోకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా, నియమనిబంధనల ప్రకారమే నడుచుకోవాలని వర్ల విజ్ఞప్తిచేశారు.