ఆ ఉద్యోగులను స్థానికసంస్థల ఎన్నికలకు దూరంగా వుంచండి...: సీఈసీకి టిడిపి ఫిర్యాదు

ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేయడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోందంటూ టిడిపి నాయకలు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.  

TDP Leaders to meet CEC Over Localbody elections

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆద్వర్యంలో టిడిపి నేతల బృందం కమీషనర్ ని కలిసి వినతిపత్రం అందించారు. 

ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో పోలింగ్ బూతులుగా ఉపయోగించే పంచాయతీ కార్యాలయాలకు, నీటి ట్యాంకులు, విద్యుత్తు స్తంభాలకు వైఎస్సార్ పార్టీ రంగులు వేసినట్లు ఫిర్యాదు చేశారు. దీనివల్ల ఎన్నికల సమయంలో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషనర్ ను కోరారు. 

read more  అది ముమ్మాటికీ జగన్ చేసిన హత్యే... కేవలం అందుకోసమే: వంగలపూడి అనిత

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన గ్రామ వాలంటీర్లలో 90శాతం వైసిపి వాళ్లేనని... ఈ విషయాన్ని స్వయంగా ఆపార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లను దూరంగా ఉంచాలని టిడిపి నాయకులు కమీషనర్ కు విజ్ఞప్తి చేశారు. 

పోలీస్, పంచాయతీ రాజ్ వ్యవస్థలను కూడా అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ పోటీదారులను భయపెట్టేందుకు రెండు వ్యవస్థల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కాబట్టి అధికార పార్టీ అక్రమాలను అడ్డుకుని పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు కళా వెంకట్రావు తెలిపారు.  

ఎన్నికలకు వెళ్లే ముందు ప్రభుత్వ వ్యవస్థలను సీఎం నీరుగార్చుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను భయపెట్టడానికే కొత్తగా చట్టం కూడా చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీల నుండి ఎన్నికయిన వారు అక్రమాలు‌ చేసినట్లు‌ నెపం నెట్టేందుకు ఎన్నికల ముందు ఈ చట్టం  తీసుకువచ్చారని అన్నారు.  

read more  ముప్పై మందితో మొదలై 16వేలకు... వారిపై ఎందుకంత కక్ష: సీఎంను నిలదీసిన మాాజీ మంత్రి

తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కమీషనర్ అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేవలం  ఎన్నికల నిబంధనలు ప్రకారమే ముందుకు వెళతామని చెప్పినట్లు కళా వెంకట్రావు తెలిపారు. ఎన్నికల కమీషనర్ కు వినతిపత్రం ఇచ్చినవారిలో కళా వెంకట్రావ్ తో పాటు ఎమ్మెల్సీ లు అశోక్ బాబు, మంతెన సత్యనారాయణ రాజులు వున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios