అమరావతి: రైతులను కన్నీళ్లు పెట్టించిన‌ వారెవ్వరూ బాగు పడలేదని... వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ ఇంతకింతా అనుభవిస్తారని ఎంపీ కేశినేని నాని విరుచుకుపడ్డారు. మాజీ సీఎం, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి నూతన సంవత్సర వేడుకలుకు దూరంగా వుండి రాజధాని రైతుల కోసం మరోసారి అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంఘీభావ సభలో ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. 

 రాజధాని కోసం‌ 34ఎకరాల భూములను ఈ ప్రాంత రైతులు త్యాగం చేశారని గుర్తుచేశారు. అటువంటి రైతులను నూతన సంవత్సరం రోజు  కలవాలని‌ చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఇక్కడికి వచ్చారన్నారు.  

 కేవలం ఒక‌ వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో రైతులు తరతరాలుగా వస్తున్న ఆస్తులు ఇవ్వడం‌ దేశంలోనే  రికార్డని... ఆ ఘటన చంద్రబాబుకు, రాజధాని రైతులకు దక్కుతుంద న్నారు. మన రాష్ట్రం అనే భావనతోనే అమరావతి ప్రాంత రైతులు మూడు పంటలు పండే పొలాలు ఇచ్చారన్నారు. అటువంటి వారిని అవహేళన చేస్తూ వైసిపి మంత్రులు రాక్షసానందం పొందుతున్నారని ద్వజమెత్తారు. 

read more  ఒక్కటే ఇల్లు ఉండాలి... కనకదుర్గమ్మను కోరుకున్నదదే: చంద్రబాబు

గతంలో త్యాగమూర్తులంటూ పొగిడిన వారే ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ లంటూ హేళన  చేస్తున్నారని అన్నారు.  ఇక్కడి నుంచి రాజధానిని తరలించడం ఎవరి తరం కాదన్నారు. వైసిపి ప్రభుత్వం ఇష్టానుసారం తరలింపు చేయడానికి ప్రయత్నిస్తే కేంద్రం, న్యాయస్థానంలో పోరాటం చేస్తామన్నారు. 

పరిపాలన‌ చేతకాకపోతే ఒక్క ఛాన్స్ అని ఎందుకు అడిగారంటూ ప్రశ్నించారు. అన్ని వనరులు ఉన్న రాజధానిని ఎందుకు మార్చడంలో  మతలబేంటని నిలదీశారు.  విశాఖపట్నంలో ఖర్చు పెట్టే పదివేల కోట్లతో అమరావతినే మరింత అభివృద్ధి చేయవచ్చు కదా అని సూచించారు.

లక్ష కోట్లు పేరు ‌చెప్పి విశాఖ మీద మోజుతో తరలించాలని చూస్తున్నారని అన్నారు. విశాఖ ప్రజలు అమాయకులు కాబట్టి వారిని దోచుకుందామని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పులివెందుల ముఠాలను దింపి ప్రజలను‌ భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. జగన్ తాత రాజారెడ్డి వచ్చినా రాజధానిని తరలించలేరని అన్నారు. 

read more  ఏపి గవర్నర్ ప్రోటోకాల్ పరిమితులకు మినహాయింపు

ఇక్కడ నుంచి రాజధాని తరలించబోము అని‌ చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తాంమన్నారు. నూతన సంవత్సరం రోజు రైతులను ఏడిపించడానికి జగన్ ముఠాకు సిగ్గుండాలని అన్నారు. పరిపాలన చేతకాక పోతే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని ఎంపి నాని సవాల్ విసిరారు. 

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు దంపతులతో పాటు కేశినేని నాని, మాగంటి బాబు, గల్లా అరుణకుమారి, పంచుమర్తి అనురాధ, శ్రావణ్ కుమార్, వర్ల రామయ్య తదితరులు పర్యటించారు.