ఏపి గవర్నర్ ప్రోటోకాల్ పరిమితులకు మినహాయింపు
ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ ను రాష్ట్ర ప్రజలతో జరుపుకోన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ లోకి సామాన్యులను అనుమతించాలని గవర్నర్ సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
విజయవాడ: నూతన సంవత్సర తొలి రోజు (బుధవారం) ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఇందుకోసం ఆయన ప్రోటోకాల్ పరిమితులకు మినహాయింపునిచ్చారు. ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సాధారణ ప్రజలు గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియచేసే అవకాశం కల్పించినట్లు గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో జనవరి ఒకటవ తేదీ ఉదయం 11 గంటల నుండి 12.30 గంటల వరకు గవర్నర్ రాష్ట్ర ప్రజలను కలవనున్నారు. కార్యక్రమానికి హాజరు కాదలచిన వారిని భద్రతా పరిమితులకు లోబడి రాజ్ భవన్ లోకి అనుమతించటం జరుగుతుందని, సందర్శకులు తమతో ఎటువంటి పుష్ప గుఛ్చాలను తీసుకురాకూడదని పేర్కొన్నారు.
read more సీఎం జగన్ పై పాట... డిప్యుటీ సీఎం టిక్ టాక్ వీడియో వైరల్
రాష్ట్ర ప్రథమ పౌరుడికి శుభాకాంక్షలు తెలియచేసేందుకు కేవలం మొక్కలను మాత్రమే రాజ్ భవన్ కు అనుమతించటం జరుగుతుందని మీనా వివరించారు. పాఠశాల విద్యార్ధులు, వయో వృద్దులను ప్రత్యేక మార్గం ద్వారా అనుమతించటం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం నూతన సంవత్సర శుభవేళ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు.
, ఇప్పటికే ఖరారైన కార్యక్రమాన్ని అనుసరించి తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో వేద పండితులు గవర్నర్ ను కలిసి ఆశీర్వదించనున్నారు. అటు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్ధానం పండితులు కూడా గవర్నర్ ను ఆశీర్వదించనున్నారు.
మరోవైపు నూతన సంవత్సర శుభవేళ గవర్నర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేసారు. 2020 సంవత్సరంలో ప్రతి పౌరుడికీ మంచి జరగాలని ఆకాంక్షించిన బిశ్వ భూషణ్, అందరికీ అయురారోగ్యాలను ప్రసాదించాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాధుని వేడుకుంటున్నట్లు వివరించారు.