ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఫైరయ్యారు. స్పీకర్ స్థానంలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆయన బహిరంగ లేఖ రాశారు. 

‘‘ స్పీకర్‌ స్థానంలో ఉంటూ మీరు చేసిన వ్యాఖ్యలను మీడియాలో చూశాను. ఈ విధమైన వ్యాఖ్యలు గతంలో ఈ స్థానంలో ఉంటూ ఎవరూ చేయలేదనేది సుదీర్ఘకాలంగా సభలో ఉన్న మీకు తెలియందికాదు. 

సభాపతి స్థానం విలక్షణమైనది,విశిష్టమైనది. రాజ్యాంగపరమైన ఆంక్షల విషయమే కాదు, పార్లమెంటరీ వ్యవస్థలో ఆ స్థానానికి ఎంతో గౌరవం ఉంది. స్పీకర్‌ స్థానం గురించి చెప్పాలంటే రాజ్యాంగం, కౌల్‌ అండ్‌ షక్దర్‌, 10వ షెడ్యూల్‌ మూడింటిని కలిపి విశ్లేషించాలి. 

జి.వి. మౌలాలంకర్‌, ఎంఏ అయ్యంగార్‌, హుకం సింగ్‌, నీలం సంజీవ రెడ్డి,అయ్యదేవర కాళేశ్వర రావు తదితరులు ఎందరో ఆ స్థానానికి వన్నెతెచ్చారు.

 ''Speaker represent the whole state” అని జవహర్‌ లాల్‌ నెహ్రూ అన్నారు. ''సభాపతి స్థానం విశిష్టత, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల అందరి గౌరవాన్ని పరిరక్షించేవారని,'' బాబూ రాజేంద్ర ప్రసాద్‌,వల్లభాయ్‌ పటేల్‌,మధు దండావతే తదితరులు పేర్కొన్నారు.

స్పీకర్‌ వ్యవస్థ యొక్క, పదవి యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత బైట వ్యక్తులతో పాటు, కుర్చీలో ఉన్న వాళ్లకు కూడా ఉండాలి. ''నేను ఆ గౌరవాన్ని కాపాడను, మామూలు రాజకీయ నాయకుడిగా ప్రవర్తిస్తాను'' అంటే అందరి విమర్శలకు గురి కావాల్సివస్తుంది. ''లోపల ఉంటేనే స్పీకర్‌, బైటకు వస్తే స్పీకర్‌ ను కాదనే'' ధోరణి సరైందికాదు. ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని నిలబెట్టాల్సిన పదవిలో ఉన్న వ్యక్తే ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని కించపరచడం తగనిపని.

పరిణామ క్రమంలో గొంగళిపురుగు సీతాకోక చిలుక అవుతుంది. సీతాకోకచిలుక అయ్యాక అందరూ ఆకర్షితులు అవుతారు. మళ్లీ గొంగళిపురుగు దశకు సీతాకోకచిలుక చేరాలని అనుకోదు. 

నేను సీతాకోక చిలుకను కాదు..గొంగళిపురుగునే అంటే గొంగళి పురుగుగానే చూస్తారు.

స్పీకర్‌ కు విచక్షణాధికారాలు ఉన్నాయి కాబట్టే వివాదాస్పదం కారాదు. ఏకపక్షంగా వ్యవహరిస్తామంటే ఇక అది మీ విజ్ఞత.. లేదూ సభాపతిగా అందరి గౌరవం పొందుతానంటే ప్రజలంతా ప్రశంసిస్తారు. కాదని వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తే, స్పీకర్‌  గా ఆ గౌరవం పొందే విలక్షణతను కోల్పోతారు.

నిరాధార ఆరోపణలు చేయడం స్పీకర్‌ స్థానంలో ఉన్నవారికి తగదు. తప్పుడు ఆరోపణలు చేయడం స్పీకర్‌ స్థానానికే కళంకం. ఆరోపణల గురించి సమాచారం ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి, కావాలంటే మీడియాకు విడుదల చేయండి. 

వ్యక్తులను కించపర్చాలనే ఉద్దేశంతో వ్యక్తిగత ప్రకటనలు చేశానని సమర్ధించుకోవడం రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి తగదు. స్పీకర్‌ కాకముందు ఎమ్మెల్యేను, సామాన్యుడిని కాబట్టి ఆవిధంగా మాట్లాడే హక్కు ఉందనడం సరికాదు. వ్యక్తిగా విమర్శలు చేసినప్పుడు ప్రతివిమర్శ చేసే హక్కు వారికీ ఉంటుంది. 

శాసనసభ బయట ఒక ఎమ్మెల్యేగా, ఒక సామాన్యుడిగా మాట్లాడాను అనుకుంటే, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బిజినెస్‌ రూల్స్‌ 168, 169 మీకెందుకు వర్తించకూడదు?

అంతే తప్ప స్పీకర్‌ గా విశిష్టమైన స్థానంలో ఉంటూ ఆ విశిష్టతను దెబ్బతీసే తప్పుడు ఆరోపణలు ఇతరులపై చేయడం సమంజసం కాదనే విషయాన్ని ఈ లేఖద్వారా మీ దష్టికి తెస్తున్నా’’ను. అంటూ యనమల రామకృష్ణుడు సదరు లేఖలో పేర్కొన్నారు.

Read Also:

వల్లభనేని వంశీపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర కామెంట్స్

నోరు మూసుకుని కూర్చోలేను, వంశీపై చర్యలు తీసుకుంటా: స్పీకర్ తమ్మినేని సీతారాం