నోరు మూసుకుని కూర్చోలేను, వంశీపై చర్యలు తీసుకుంటా: స్పీకర్ తమ్మినేని సీతారాం
వైసీపీలో చేరాలనుకునేవారు రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. కళ్లముందు జరిగే అన్యాయాలపై తాను నోరుమూసుకుని కూర్చోలేను అని చెప్పుకొచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
విశాఖపట్నం: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. వంశీ నిర్ణయంపై మాట్లాడేందుకు తాను ఎవరిని అంటూ ఎదురు ప్రశ్నించారు.
వైసీపీలో చేరాలనుకునేవారు రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. కళ్లముందు జరిగే అన్యాయాలపై తాను నోరుమూసుకుని కూర్చోలేను అని చెప్పుకొచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం. నిబంధనలు అతిక్రమిస్తే వంశీపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వంశీ తన రాజీనామాపై స్పష్టంగా వివరణ ఇచ్చారని తెలిపారు.
విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన తమ్మినేని సీతారాం వంశీ రాజీనామా తన వద్దకు చేరిందా లేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే సమాజంలో బాలల వ్యవస్థ ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బాలల పరిరక్షణ, హక్కుల కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. బాలల్లో నేర ప్రవృత్తి రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన చెందారు. తల్లిదండ్రుల దగ్గరినుంచే పిల్లల్లో నేర ప్రవృత్తిని అరికట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
అలాగే తల్లిదండ్రుల అరాచకం మీద కూడా చట్టాలు తీసుకురావాలని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా బాలల వ్యవస్థపై చర్చ జరుగుతోందన్నారు.
యుఎన్‌ఓ అసెంబ్లీ బాలలపై చేసిన తీర్మానాలను బాలల పరిరక్షణ సంఘాలు ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. బాలల చట్టాలను ఉక్కుపాదంతో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలిపారు.
సమాజంలో పిల్లల పట్ల ఆలోచన మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. దైవస్వరూపులైన బాలలను బలత్కరిస్తున్న వైనాలు దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశారు. ఏపీ శాసనసభలో బాలల పరిరక్షణపై చర్చ జరపాలన్న ప్రతిపాదనపై సీఎం జగన్ తో చర్చిస్తానని సీతారాం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
బాబుపై తీవ్ర వ్యాఖ్యలు: టీడీపీ నుండి వల్లభనేని వంశీ సస్పెన్షన్
హీటెక్కిన ఏపీ రాజకీయం: ఎమ్మెల్యే వంశీపై టీడీపీ నేతలు ఫిర్యాదు