దోపిడికి కేరాఫ్‌గా వైసీపీ మద్యం విధానం మారిందన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత కేఎస్ జవహర్. అధికారం చేపట్టిన 6 నెలల్లోనే రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత ఒక్క జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన మండిపడ్డారు. గ్రామగ్రామాన మద్యాన్ని ఏరులై పారిస్తూ..పచ్చని పల్లెలను నాటుసారా, గుడుంబా తయారీలకు కుటీరపరిశ్రమలుగా మార్చేశారని జవహర్ ఆరోపించారు.

వైకాపా ప్రభుత్వ వైఫల్యంతో గంజాయి విక్రయాలూ రాష్ట్రంలో జోరుగా  సాగుతున్నాయని.. సాక్షాత్తూ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్దే పెద్దమొత్తంలో పట్టుబడిన గంజాయి.. ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతోందని జవహర్ చురకలంటించారు. పైకి మద్యం నియంత్రణ పేరుతో అధిక రేట్లకు విక్రయిస్తూ ప్రజలను లూటీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Also Read:ఉల్లి ధర ఠారెత్తిస్తోందా? ఇక్కడ మాత్రం కిలో 25 రూపాయలే

జే ట్యాక్స్‌ ద్వారా మీరు ప్రవేశపెట్టిన సెలక్టెడ్‌ బ్రాండ్‌లు తాగిన ప్రజల ప్రాణాలు హరి అంటున్నాయని.. ఇంకొందరు ప్రాణాంతక వ్యాధుల పాలవుతున్నారని జవహర్ ఎద్దేవా చేశారు. రాజును బట్టే రాజ్యం, రౌతుని బట్టే గుర్రం అన్న సామెతగా ప్రభుత్వాన్ని నడిపించే నాయకత్వం ఎంత బాగా పనిచేస్తే రాష్ట్రం అంత అభివృద్ధి అవుతుందని ఆయన గుర్తు చేశారు.

హోంమంత్రి సుచరిత మంత్రి అయినప్పటికీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నారని జవహర్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తమపై నెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు.

Also Read:లంగాఓణీలో అనసూయ నడుము సొగసు.. పిచ్చెక్కించేలా ఫోజులు!

తెలుగుదేశం హయాంలో గంజాయి, సారాయిపై ఆధారపడేవారికి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యామ్నాయం చూపమని జవహర్ గుర్తు చేశారు. వైఎస్సార్‌, జగన్మోహన్‌రెడ్డి హయాంలలోనే రాష్ట్రంలో బెల్టుషాపులు పెద్దసంఖ్యలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీనిపై బహిరంగ చర్చకు వైకాపా సిద్ధమా..? అంటూ జవహర్ సవాల్ విసిరారు.