Asianet News TeluguAsianet News Telugu

ఉల్లి ధర ఠారెత్తిస్తోందా? ఇక్కడ మాత్రం కిలో 25 రూపాయలే

దేశమంతటా ఉల్లిగడ్డ కోయకుండానా కన్నీరు కారేలా చేస్తుంది. ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. దేశమంతా ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలా చోట్ల కిలో ఉల్లి ధర 100 ను చేరుకుంది.

onion to be given at a subsidized price of 25 in andhrapradesh
Author
Vijayawada, First Published Nov 24, 2019, 5:02 PM IST

దేశమంతటా ఉల్లిగడ్డ కోయకుండానా కన్నీరు కారేలా చేస్తుంది. ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. దేశమంతా ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలా చోట్ల కిలో ఉల్లి ధర 100 ను చేరుకుంది. 

తెలంగాణ రాష్ట్రంలో కూడా కిలో ఉల్లి ధర 40 నుంచి 50 రూపాయల వరకు ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఉల్లిధరలు కట్టడి చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కిలో ఉల్లి కేవలం రూ. 25 మాత్రమే విక్రయించేలా అధికారుు చర్యలు చేపట్టారు.

Also read: ఒకప్పుడు కన్నీరు పెట్టించిందే ఇప్పుడు కాసులు కురిపిస్తోంది..

 ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రైతు బజార్లలో ఆదివారం నుంచి ఉల్లి విక్రయాలు ప్రారంభం అయ్యాయి. బయట మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.80 వరకు ఉండగా, రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ. 25 కే విక్రయించనున్నట్టు అధికారులు తెలిపారు. 

ఉల్లిపాయను 25రూపాయలకే విక్రయిస్తుండడంతో, ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడనుందని అధికారులు తెలిపారు. రైతు బజార్లలో ఉల్లిపాయలను విక్రయించేందుకు ప్రభుత్వం కర్నూలు జిల్లా రైతుల నుంచి రోజుకు 150 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేయనుంది. 

ఇలా కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లోని రైతు బజార్లకు ఈ ఉల్లిపాయలను సరఫరా చేస్తున్నారు. ఇలా సరఫరా చేయడం వల్ల రాష్ట్రంలో కొరత రాకుండా చూసేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. 

 
ప్రస్తుతం రైతుబజార్లలో ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను మాత్రమే ఇస్తున్నారు. ఉల్లిపాయ నిల్వలు రోజువారీ అవసరాలకు మించి ఎక్కువకు చేరుకున్న తరువాత ఈ కోటాను పెంచనున్నట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. 

ఇకపోతే మొన్నీమధ్యనే అధికారులు ఉల్లి అక్రమ నిలువలపై విరుచుకుపడ్డారు.ఉల్లి ఎగుమతులపై నిషేధం.. దేశీయ వ్యాపారులపైనా ఆంక్షలు మార్కెట్‌లో ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరగడంతో ఉల్లి వ్యాపారులు ఉల్లిని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా విజిలెన్స్ అధికారులు నడుం బిగించారు. రాష్ట్రంలోని 70 ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు ఏక కాలంలోసోదాలు నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల అక్రమంగా ఉల్లిపాయ నిల్వలు ఉన్నట్టుగా పోలీసులు విజిలెన్స్  అధికారులు గుర్తించారు. 27 లక్షల విలువైన 603 క్వింటాళ్ల ఉల్లిపాయ నిల్వలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 

Also read: 

అంతేకాదు అక్రమంగా ఉల్లిపాయ నిల్వలను ఉంచిన 37 మంది ట్రేడర్స్‌కు జరిమానాలు విధించారు. అంతేకాదు  వారికి నోటీసులు కూడ జారీ చేశారు. అక్రమంగా ఉల్లిపాయలను ఎందుకు నిల్వ చేశారనే విషయమై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

అక్రమంగా ఉల్లిపాయలను నిల్వ ఉంచిన 10 మంది ట్రేడర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఒక్క హోల్‌సేల్ వ్యాపారుల వద్ద 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్ల వద్ద 10 మెట్రిక్ టన్నుల ఉల్లి నిల్వలు మాత్రమే ఉండాలి. 

కానీ, నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా ఉల్లిని నిల్వ ఉంచిన  వారిపై విజిలెన్స్ అధికారులు కేసులు  నమోదు చేశారు.మార్కెట్లో ఉల్లిపాయ కృత్రిమ కొరతను సృష్టించి ధరలను  విపరీతంగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని విజిలెన్స్ అధికారులు చెప్పారు.

దేశ వ్యాప్తంగా ఉల్లి నిల్వలు తగ్గిపోయాయి. మహారాష్ట్రలో వరదల కారణంగా పంట పూర్తిగా దెబ్బతింది. ఏపీ రాష్ట్రంలోని కర్నూల్ మార్కెట్ కు వచ్చిన ఉల్లి కూడ ఎక్కువ కాలం నిల్వ ఉండడం లేదని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. 

మరో వైపు దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిపోకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది. దీంతో ఉల్లి ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. 

అయితే మహారాష్ట్రలో పంట చేతికి వచ్చే సమయంలో  వరదలు ఉల్లి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో మళ్లీ ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ఉల్లి ధరలు పెరగడంతో వినియోగదరారుల నుండి సొమ్ము చేసుకొనేందుకు ట్రేడర్లు పన్నుతున్న పన్నాగాన్ని విజిలెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. అక్రమంగా ఉల్లిని నిల్వ చేసిన ట్రేడర్లపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు.

మరికొందరు ట్రేడర్లపై నోటీసులు జారీ చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్దంగా ఉల్లిని నిల్వ ఉంచకూడదని విజిలెన్స్ అధికారులను హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దాడులు కొనసాగుతాయని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉల్లిని వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకొంటున్నట్టుగా విజిలెన్స్ ఉన్నతాధికారులు ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios