రాష్ట్రం తర్వాత... ముందు నీ ఇంటి సమీపంలో పర్యటించు..: జగన్ పై ఉమ కౌంటర్
ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన ఐదు నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలను కనీసం పట్టించుకున్న పాపాన పోవడంలేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు ఆరోపించారు. రాష్ట్రం ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి జగన్ కు క నిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఇబ్రహీంపట్నం: ఇసుక లేదు...వరద ఉధృతిపై అవగాహన లేదు...రైతుకు సాయం లేదు...నష్టాలపాలైన రైతులకు కనికరం లేదు...ఇది జగన్ పాలన అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ది చెందడం అటుంచి రోజురోజుకు నాశనమవుతోందని అన్నారు.
వైఎస్సార్‌సిపి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన ఐదు నెలల నుండి రాష్ట్రం ప్రజలు వివిధ సమస్యలతో సతమతమవుతున్నట్లు మాజీ మంత్రి ఆరోపించారు. శనివారం మూలపాడు, కొటికలపూడి గ్రామాల పరిధిలో వరద నీటిలో మునిగిన పంట పొలాలను, కృష్ణా నది వరద ఉధృతిని ఆయన పరిశీలించారు. వరదల వల్ల చేతికొచ్చిన పంటను కోల్పోయిన బాధిత రైతులను ఆయన ఓదార్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ....నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేనందునే రైతులు కాయకష్టంతో పండించిన పంటను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆయనకు రైతుల కష్టాల గురించి తెలియవు కాబట్టే ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని అన్నారు.
read more శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నయా రికార్డు...
ఇటీవల హెలికాప్టర్ లో కర్నూల్ వెళ్లి అక్కడి రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రికి తన నివాసానికి దగ్గర్లో వున్న గ్రామాల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కృష్ణానది ఒడ్డునున్న గ్రామాల్లో మునకకు గురయిన రైతుల పంట పొలాలను పరిశీలించడానికి కూడా ఆయనకు తీరిక లేకుండాపోయిందని విమర్శించారు.
జగన్ ప్రభుత్వ పాలనలో చెప్పేదానికి, చేస్తున్నదానికి ఎంతో వ్యత్యాసం ఉంటోందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా లబ్ధిదారులైన రైతుకు సాయం ఇవ్వడం లేదన్నారు. ఇక రివర్స్ టెండరింగ్ విధానంతో అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి రివర్స్ గేర్ వేశారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాదాలతోనే రాష్ట్రం రెండేళ్లు వెనకబడిందని అన్నారు. తక్షణమే సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి నీట మునిగిన పంట పొలాలు పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు.
read more ఏడడుగుల మంత్రి ఏం చేయలేదు, మా మూడడుగుల బుల్లెట్ నీళ్లు తెచ్చాడు: జగదీష్ రెడ్డిపై కేసీఆర్
అలాగే రాష్ట్రంలో ఇసుక కొరతను తగ్గించే చర్యలను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఇసుక లేక 30 లక్షల మంది భవననిర్మాణ రంగ కార్మికులు ఆకలి మంటలతో అల్లాడుతున్నారని...వారి బాధలు పట్టవా అని ప్రశ్నించారు.
ఇద్దరు నిర్మాణ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లైనా లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.