శ్రీశైలం: ఇరు తెలుగు రాష్ట్రాల్లో చీకటిని పారద్రోలి వెలుగులు నింపుతున్న విద్యుదుత్పత్తి కేంద్రాల్లో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం అతి ముఖ్యమైంది.  ప్రస్తుతం కురుస్తున్న భారీ  వర్షాలతో  శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇక్కడి జలవిద్యుత్ కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం సరికొత్త  రికార్డును అధిగమించింది. 

శ్రీశైలం  కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం వార్షిక సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ ఉత్పత్తి టార్గెట్ ను అధిగమించింది.  ఎన్నో సమస్యలను అధిగమించి ఈ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయగలిగినట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ఒక జనరేటర్ మరమ్మతుకు గురైనప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు కుడిగట్టు విద్యుత్కేంద్రం చీఫ్ ఇంజనీర్ నరసింహారావు తెలిపారు.

read more ఉపాధిహామీ బకాయిల కోసం ఛలో అమరావతి...: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

రెండు తెలుగు రాష్ట్రాలైన  తెలంగాణ, ఆంధ్ర  ప్రదేశ్ లలో ఆయా ప్రభుత్వాలు అభివృద్ధిలో భాగంగా విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు టార్గెట్లను పెట్టుకున్నాయి. 
ఈ క్రమంలో ఏపి ప్రభుత్వం 2019-20 వార్షిక సంవత్సరంలో 850 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని టార్గెట్ గా నిర్దేశించింది. దీన్ని గురువారం ఉదయం 7 గంటలకే అధిగమించినట్లు చీఫ్ ఇంజనీర్ వెల్లడించారు. 852.213 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 150 టీఎంసీల నీటిని వినియోగించినట్లు ఆయన వెల్లడించారు. 

 ఉమ్మడి రాష్ట్రం  విడిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పడిన ఏపిజెన్‌కో కుడి గట్టు జల విద్యుత్ కేంద్రానికి 2014-15 వార్షిక సంవత్సరంలో  1135 మిలియన్ యూనిట్లు టార్గెట్ గా ఇచ్చింది. అయితే టార్గెట్ ను అదిగమించి 1153 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేశారు. అలాగే 2015-16 వార్షిక సంవత్సరం లో 1234 మిలియన్ యూనిట్లు టార్గెట్ ను పెట్టుకోగా 207.7 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేశారు. 

అలాగే 2016-17 వార్షిక సంవత్సరంలో 1055 మిలియన్ యూనిట్లను టార్గెట్ గా పెట్టుకోగా 635.413 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు.  2017-18 లో 983 మిలియన్ యూనిట్ల టార్గెట్ గా పెట్టుకోగా 574 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. 2018-19 సంవత్సరంలో 945 యూనిట్ల ఉత్పత్తి టార్గెట్ గా పెట్టుకోగా 551.39 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేశారు.

read more మమ్మల్ని భయపెట్టారు, సమ్మె ఆపేది లేదు: చర్చల తర్వాత అశ్వత్థామ రెడ్డి

గత నెల 17వ తేదీన శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 7 జనరేటర్లు 110 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉండగా ఒకటో నెంబర్ జనరేటర్ సాంకేతిక లోపంతో  మంటలు చెలరేగి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయినప్పటికీ ఈ సంవత్సరంలో టార్గెట్ ను మించి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఒక రికార్డుగా అధికారులు తెలిపారు.

శుక్రవారం సాయంత్రం ఒకటో నెంబర్ జనరేటర్ ను తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ట్రైల్ రన్ చేసి ప్రారంభించామని తెలిపారు. కొన్ని చిన్న చిన్న మరమ్మత్తులు అవసరమై ఉండగా వాటిని ముగించుకొని త్వరలో ఈ జనరేటర్ ద్వారా ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఉన్న మొత్తం 7 జనరేటర్ల ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చీఫ్ ఇంజనీర్ నరసింహారావు తెలిపారు.