విజయవాడ: కళ్ళు ఉన్నవాడు... కడుపుకి అన్నం తింటున్న వాడెవడూ రాజధానిని అమరావతి నుండి మారుస్తానని అనడంటూ మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు జలీల్ ఖాన్ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి గురించి కనీస జ్ఞానం లేకుండా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని... వీటివల్ల రాష్ట్రం చాలా నష్టపోవాల్సి వుంటుందన్నారు. 

రాష్ట్ర పరిపాలన అంతా ఒక్క దగ్గరినుండే జరగితే బావుంటుందన్నారు. అలా కాదని మూడు రాజధానుల నుండి పరిపాలన  చేస్తానంటున్న జగన్ ఆలోచన బెడిసికొట్టడం ఖాయమన్నారు. ఈయన తనకు ఇష్టం వచ్చినట్లు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలే బలవుతున్నారని అన్నారు. 

రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.  రాజధాని విషయంలో జగన్  తీసుకున్న నిర్ణయం తన పతనానికి తానే నాంది పలకడం లాంటిదని అన్నారు.   

అమరావతిలో రైతు సోదరులు, మహిళలు తమ భవిష్యత్ కోసమే కాదు రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతున్నారని అన్నారు. కాబట్టి వాళ్ళకి 13 జిల్లాల రైతులు, మహిళలు మద్దతు పలకాలని జలీల్  ఖాన్ సూచించారు. 

READ  MORE  జగన్ గారూ... ఆ మహిళా శక్తిని ఆపడం మీ తరం కాదు: వర్ల రామయ్య

విశాఖలో ప్రభుత్వ భూములు, క్రిస్టియన్ సంస్థల భూముల మీద సీఎం జగన్, వైసిపి నాయకుల కన్ను పడిందని ఆరోపించారు. ఒక్క చాన్స్ ఇవ్వండి ఏపీని ఇంద్రలోకం చేస్తానన్న జగన్ తనకోసం మాత్రమే పనికొచ్చే ఇంద్రలోకాన్ని నిర్మించుకునే ప్రయత్నంలో వున్నారని ఎద్దేవా చేశారు. 

రాజధాని కోసం సీనియర్ మంత్రులతో హై పవర్ కమిటీ ఏర్పాటు చేయడం విడ్డూరంగా వుందన్నారు. ఇప్పటివరకు హైపవర్ కమిటీ అంటే మేధావులు, రిటైర్ జడ్జి లతో ఏర్పాటుచేయడాన్ని మాత్రమే చూశామని... కానీ జగన్ కొత్తరకం హైపవర్ కమిటీని ఏర్పాటుచేశాడని అన్నారు.  గొర్రెల్లా తలూపే జగన్ మనుషులే ఈ కమిటీలో ఉన్నారని జలీల్ ఖాన్ పేర్కొన్నారు.

ఇప్పటికైనా జగన్ తన పరిపాలన మీద ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని సూచించారు. రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రజాధరణ వుందని నిరూపించుకోవాలని... అందుకోసం ఇప్పుడున్న  వైసిపి ఎమ్మెల్యేలందరిచేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అప్పుడు కూడా ఇదే ఫలితం  వస్తే ప్రజలంతా ఆయనవైపు వున్నారని నిరూపితం అవుతుందన్నారు.

బోస్టన్ కమిటీకి రాజధానిపై అసలు కనీస అవగాహనయినా ఉందా?అని ప్రశ్నించారు. మహిళలను రైతులను ఇబ్బంది పెడితే దేవుడు చూస్తూ ఉరుకోడని... ఇంతకింతా శిక్ష విధిస్తాడని వైసిపి  ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించారు. రాజధానిని అమరావతి నుండి మార్చకుండా ఉంటే జగన్ కి పాదాభివందనం చేసి కాళ్లుకడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకుంటానని అన్నారు. 

READ MORE  రాజధాని కోసం కాదు... అందుకోసమే అమరావతి రైతుల ఉద్యమం: వైసిపి ఎమ్మెల్యే సంచలనం

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అంటే ఉద్యోగులు భయపడుతున్నారని... అందుకే   రాజధాని విషయంలో ఇంత జరుగుతున్నా వారుమాత్రం సైలెంట్ గా వున్నారని అన్నారు. దయచేసి వారుకూడా రాజధాని కోసం పోరాటం ప్రారంభించాలని జలీల్ ఖాన్ సూచించారు.