వైసిపి ఎంపీపై దాడికి టిడిపి విద్యార్థి విభాగం ప్రయత్నం... 20మందిపై కేసు
వైఎస్సార్ కాంగ్రెస్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్ ను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై సీరీయస్ అయిన ఎంపీ పోలీసులకు పిర్యాదు చేయడంతో 20 మందిపై కేసులు నమోదయ్యాయి.
విజయవాడ: వైసీపీ నేత, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ని ఆదివారం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అధికారిక కార్యక్రమంలో భాగంగా నందిగామకు వెళ్లగా తన వాహనాన్ని కొందరు అకారణంగా అడ్డుకోవడమే కాదు దాడికి కూడా ప్రయత్నించినట్లు ఎంపీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఎంపీ వాహనాన్ని అడ్డుకున్న 20మందిపై కేసులు నమోదు చేసినట్లు నందిగామ డిఎస్పీ రమణ మూర్తి ప్రకటించారు.
ఈ ఘటనపై డీఎస్పీ మాట్లాడుతూ... ఒక దళిత ఎంపీ కారును అడ్డగించి ఆయన పక్కనున్న సిబ్బంది పిఏ మరియు గన్ మేన్లపై అరుపులు కొందరు కేకలేస్తూ దాడికి యత్నించారని ఫిర్యాదు అందినట్లు తెలిపారు. దీంతో దళిత ఎంపీ అవమాన పరిచినందుకు వారిపై కేసులు నమోదు చేశామని... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
video ఎంపీ నందిగం సురేశ్‌కి రాజధాని సెగ
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అమరావతి నుండి రాజధానికి తరలించాలన్న వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ నందిగం సురేశ్ ని నందిగామలో కొందరు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. కారు దిగిన ఎంపీకి గులాబీ పూలు అందిస్తూ వ్యంగ్యంగా వ్యవహరించి అవమానించడమే కాదు వ్యక్తిగత సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. తనను కూడా అంతు చూస్తానంటూ విద్యార్ది సంఘాల నాయకులను బెదిరించినట్లుగా పేర్కొంటూ ఎంపీ పోలీసులకు తెలిపారు.
వైసిపి ఎంపీపై టిడిపి అనుబంధ విబాగానికి చెందిన నాయకులు దాడికి ప్రయత్నించడాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఖండించారు. గతంలో పొలాలు తగులబెట్టిన ఘటనలో రైతులకు మద్దతుగా నిలిచినందుకే ఉద్దేశపూర్వకంగా టీడీపీ కార్యకర్తలు సురేశ్ పై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులకు సూచించారు.