విజయవాడ: కృష్ణా జిల్లాలో మరో అనుమానిత కరోనా కేసు నమోదయ్యింది. జగ్గయ్యపేటలో ఓ యువతి కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇటలీలో చదువుకుంటున్న సదరు యువతి నెల రోజుల క్రితమే స్వదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కరోనా వైరస్ బారిన పడిందేమోనన్న అన్న అనుమానంతో వైద్యాధికారులు ప్రత్యేకంగా చికిత్స అందించే ఏర్పాటు చేశారు. 

జగ్గయ్యపేటకు చెందిన పెద్దిరెడ్డి బాలశ్రీ అనే యువతిని కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతుండటంతో వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రథమ చికిత్స అందిస్తున్నామని... కరోనా కు సంబంధించిన టెస్టులు చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజాలెవరూ కరోన వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. వైరస్‌పై ముఖ్యమంత్రి ప్రతీ రోజూ సమీక్షలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో కరోనా జాడలు బయటపడిన నేపథ్యంలో ఆళ్లనాని అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుక్షణం అప్రమత్తంగా ఉందని, పోర్టుల్లోనూ.. ఎయిర్‌పోర్టుల్లోనూ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తగా 8 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని.. తాజాగా కేంద్రం సూచనల మేరకు ప్రత్యేకంగా ఐసోలేషన్ రూములు కూడా ఏర్పాటు చేశామని ఆళ్లనాని వెల్లడించారు.

read more  కరోనా వైరస్.. భక్తులు భయపడొద్దు: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ఎక్కడికక్కడ మాస్కులు..వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనాపై కొన్ని నిరాధారమైన వార్తలు వస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాని స్పష్టం చేశారు. ఒకవేళ కరోనా వైరస్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై కేంద్రం ఈ నెల 6న వర్క్‌షాప్ నిర్వహిస్తోందని.. దీని ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

విశాఖ, తిరుపతి, కర్నూలు, కాకినాడ, నెల్లూరు లాంటి చోట్ల ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంచడంతో పాటు ఏఎన్ఎంల ద్వారా కూడా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని మంత్రి చెప్పారు.

read more  కరోనా ఎఫెక్ట్: విశాఖ షిప్‌యార్డ్‌కు చైనా నౌకకు నో ఎంట్రీ

కరోనాకు ఇప్పటి వరకు మందు లేకపోవడంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. 08662410978 కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, కరోనాపై ఎలాంటి అనుమానం వున్నా, ఈ నెంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఆళ్లనాని సూచించారు. కరోనాకు సంబంధించి ప్రతి రోజూ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.