అమరావతిపై టిడిపి రౌండ్ టేబుల్ సమావేశం... తీర్మానాలివే
విజయవాడలో టిడిపి ఆద్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష పార్టీలన్ని కలిసి కొన్ని ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నాయి.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించడంపై నెలకొన్న సందిగ్ధతపై టిడిపి ఆద్వర్యంలో అఖిలపక్షాలతో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైసిపి ప్రభుత్వం నుంచి అమరావతిపై వెలువడుతున్న అసంబద్దమైన ప్రకటనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై అన్ని పార్టీల నాయకులు చర్చించారు. ఈ మేరకు కొన్ని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ప్రజా రాజధాని అమరావతి పనులు గత ఆరు నెలలుగా స్తంభించిపోవడం పట్ల సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రానికి తలమానికం కానున్న అమరావతి మాస్టర్ ప్లాన్ ను యధాదథంగా అమలు చేస్తూ పనులను ప్రస్తుత ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేయాలని... ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
read more ప్రధాని మోదీని కలిసిన మాట నిజమే...కానీ...: గంటా శ్రీనివాస్
ఆలస్యమయ్యే ప్రతి క్షణం నిర్మాణ వ్యయాన్ని పెంచుతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు . రాష్ట్రంలోని 13 జిల్లాలకు భవిష్యత్తులో రాజధాని ద్వారా వేల కోట్ల ఆదాయం, లక్షలాది ఉపాధి అవకాశాలు రానున్నాయని... అలాగే పేదరిక నిర్మూలనకు కూడా ఉపయోగపడుతుందన్నారు. అలాంటి అద్భుత అవకాశాలను ప్రభుత్వం కాలరాయాలనుకోవడాన్ని సమావేశం తీవ్రంగా తప్పుబట్టింది.
ప్రజా రాజధానిగా రూపుదిద్దుకోనున్న అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పుల్లేకుండా యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని ప్రభుత్వానికి అఖిలపక్షాలు డిమాండ్ చేశాయి . రాజధాని అమరావతిపై చర్చించడానికి ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరుతూ సమావేశం ఏక గ్రీవంగా తీర్మానించింది.
read more గతంలో రాళ్లు, చెప్పులు.... ఈసారి మరేమిటోనని చంద్రబాబు భయపడే...: శ్రీదేవి