విశాఖపట్నం: తన రాజకీయ భవిష్యత్ పై వస్తున్న కథనాలన్నీ మీడియా సృష్టేనని మాజీ మంత్రి, టిడిపి నాయకులు గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందునుంచి ఇప్పటివరకు తన పార్టీ మార్పుపై కథనాలు వెలువడుతూనే వున్నాయని అన్నారు. ఈ ప్రచారాన్ని తాను ఎన్నోసార్లు కొట్టిపారేసిన ఆగలేదని... అందువల్లే ఈ మధ్యకాలంలో పట్టించుకోవడం మానేశానని అన్నారు. 

తనను ఏదోవిధంగా నిరంతరం వార్తల్లో వుంచుతున్న మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలంటూ గంటా ఎద్దేవా చేశారు. ఎంతో మంది కోరుకున్నా పబ్లిసిటీ దక్కదని... కానీ తనకు మాత్రం ఉచితంగానే మీడియా పబ్లిసటీ కల్పిస్తోందన్నారు. 

తాను ప్రధాని నరేంద్రమోదీతో కలిసి తీసుకున్న ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాతో పాటు మీడియా సంస్థల్లో చక్కర్లు కొడుతున్నాయని... అవి నిజమైన ఫోటోలేనని స్పష్టం చేశారు. అయితే అవి మోదీ గుజరాత్ సిఎంగా... తాను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వున్నప్పటివని తెలిపారు. వాటికి ఇప్పుడు వైరల్ చేస్తూ తాను బిజెపిలో చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

read more  సంపద సృష్టి చేతకాకే... పక్కరాష్ట్రాలకు దోచిపెట్టడానికే ఆ పథకం: జగన్ పై చంద్రబాబు ఫైర్

ఇప్పటికే తాను బిజెపిలో చేరడానికి నాలుగైదు ముహూర్తాలు కూడా మీడియానే పెట్టిందన్నారు. తన రాజకీయ భవిష్యత్ పై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తానే స్వయంగా ప్రకటిస్తానని... ఇప్పుడూ అదే చెబుతున్నానని అన్నారు. 

వివిధ సందర్భాల్లో, ఫంక్షన్లలో ఇతరపార్టీల వ్యక్తులను కలుస్తుంటామని... వాటిని రాజకీయాలతో ముడిపెట్టలేమన్నారు. అమిత్ షా గురించి పవన్ చేసిన వ్యాఖ్యలపై గంటా స్పందించారు. బీజేపీ మంచిదని అన్నాడో లేక బీజేపీకి దగ్గర అవ్వాలని అన్నాడో పవన్ నే అడగాలని సూచించారు. 

read more జగన్ డిల్లీ పయనం... మోదీ, అమిత్ షాలతో ఆ అంశంపై చర్చించేందుకే..

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి ఎంత చేయగలనో అంతే చేస్తున్నానని తెలిపారు. తాను ఏ నిర్ణయం తీసుకోవాలన్న తనను నమ్మిన కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ఫైనల్ చేస్తానని గంటా శ్రీనివాస్ వెల్లడించారు.