విజయవాడ: వృద్ధుడు వసంతరావు మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కరోనావైరస్ పరీక్షల కోసం వచ్చిన తన భర్త కనిపించకుండా పోయాడని ఓ వృద్ధురాలు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే.  పది రోజులుగా ఆమె తన భర్త ఆచూకీ కోసం గాలిస్తూనే ఉంది. అయితే, కోవిడ్ -19 పరీక్షల కోసం వచ్చిన తన భర్త ఆచూకీ చెప్పడంలో వైద్యులు విఫలమయ్యారు. 

దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసును ఛేదించారు. కరోనా వైరస్ బారిన పడిన వసంతరావు గత నెల 24వ తేదీ అర్థరాత్రి మరణించాడు. దాంతో అతని శవాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే, వృద్ధుడి వివరాలను ఆస్పత్రి సిబ్బంది రికార్డు చేయలేదు. దాంతో అతని ఆచూకీని కనిపెట్టడం కష్టంగా మారింది. 

Video: ఏపిలో కోవిడ్ ఆస్పత్రికి వెళ్లి భర్త అదృశ్యం.. రోడ్డెక్కిన భార్య (చూడండి)

వైద్యుల తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు వృద్ధుడిని కనిపెట్టారు. మార్చురీలో అతని శవాన్ని గుర్తించారు. దాంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తన భర్త వసంతరావు కనిపించకుండా పోయాడని భార్య ధనలక్ష్మి ఆరోపించారు. విజయవాడలో నివాసం ఉండే వసంతరావుకు ఆయాసం రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. దాంతో కరోనా లక్షణాలు ఉన్నాయని ఆయనను కోవిడ్ -19 ఆస్పత్రికి పంపించారు. 

గత నెల 24వ తేదీ రాత్రి కోవిడ్ -19 ఆస్పత్రికి వెళ్లగా, చాలా సేపటికి వీల్ చైర్ లో ఆయనను సిబ్బంది ఆస్పత్రి లోనికి తీసుకుని వెళ్లారు. ధనలక్ష్మిని లోనికి అనుమతించలేదు. తెల్లారి వెళ్తే ఆ పేరుతో ఎవరూ ఆస్పత్రిలో లేరని చెప్పారు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి, ప్లకార్డు పట్టుకుని ఆస్పత్రి ముందు కూర్చున్నారు.