జగన్ భార్య భారతిపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసిపి నాయకులు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై సంచలన ఆరోపణలు చేశారు.  MLC Budda Venkanna shocking comments on ys bharathi 

MLC Budda Venkanna shocking comments on ys bharathi

అమరావతి: భువనేశ్వరి అమరావతి వచ్చివెళ్లినప్పటినుంచీ వైసీపీనేతల వెన్నులో వణుకు మొదలైందని, జగన్‌ ప్రభుత్వం కక్షసాధింపులకు బలవుతున్న రాజధాని రైతుల్ని పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు సతీమణిపై నోరుపారేసేకోవడం మానుకోవాలని టీడీపీ అధికారప్రతినిధి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. 

శుక్రవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీరాముడి వెంట సీతాదేవి వచ్చినట్లుగా చంద్రబాబుతో పాటు భువనేశ్వరి రైతులధర్నాలో పాల్గొన్నారని అది మొదలు రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు ఆమెను లక్ష్యంగా చేసుకొని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వెంకన్న మండిపడ్డారు. ఆమెరాక వైసీపీ నేతలకు చెమటలు పట్టించిందనడానికి వారు చేస్తున్న తప్పుడు ఆరోపణలే నిదర్శనమన్నారు.

జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతి, భారతీ సిమెంట్స్‌కి చెందిన మనీలాండరింగ్‌ కేసులో ఐదవ ముద్దాయిగా ఉన్నారని, ఆమెకు చెందిన రూ.23కోట్లను జప్తుచేయడం జరిగిందన్నారు. భారతిలా భువనేశ్వరిపై ఎలాంటి కేసులు లేవని, తన కంపెనీ నుంచి బియ్యం సంచులు తయారుచేయించి భారతిలాగా వాటిలో కమీషన్లు కాజేసిన చరిత్ర, కక్కిన కూటికి ఆశపడే స్వభావం భువనేశ్వరికి లేవన్నారు. ఆడవాళ్లనుగురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదన్న ఒకే ఒక్క సంస్కారంతో టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారన్నారు. 

వైసీపీ వాళ్లకు భువనేశ్వరి నిజాయితీ గురించి మాట్లాడటం తప్ప మరోమార్గం లేదన్నారు.  భారతి రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నా రని... వాటి గురించి మాట్లాడే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని వెంకన్న ప్రశ్నించారు. 

read more  మందడం మహిళలపై పోలీసులు దాడి... జాతీయ మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు

పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన పార్టీవాళ్ల భూముల కొనుగోళ్లపై స్పందించాలని... వైసీపీ నేతల భూములచిట్టాతో ఆయన చర్చకు వస్తే ఏ పార్టీలో ఎవరికి ఎందరు బినామీలున్నారో తేలుతుందన్నారు. కోర్టుల్లో కేసులు వేయడం ద్వారా అమరావతి అభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగిలిన కరకట్ట కమలహాసన్‌ తన వద్ద ఉన్న ఆధారాలతో   రైతులు ముందుకు వస్తే వారిమధ్యనే చర్చిద్దామని వెంకన్న సవాల్‌ విసిరారు.

జగన్‌ ఉంటున్న ఇల్లు ఎవరిదో తెలుసా..జగన్‌లా ఊరికొక ఇల్లు కట్టుకోవడం చంద్రబాబుకి తెలియదని, ఆయనకు తెలిసిందల్లా ప్రజల సంక్షేమమేనన్నారు. తాడేపల్లిలో జగన్‌ ఉంటున్న ఇల్లు సండూర్‌పవర్‌ కంపెనీకి చెందిన అనిల్‌ కుమార్‌ రెడ్డిది కాదా అని బుద్దా నిలదీశారు. 

మంగళగిరి ప్రజలపై తనకే ప్రేమ ఉన్నట్లు ఆర్కే మాట్లాడుతున్నాడని కోళ్లఫారం యజమానికి కోళ్లపై ఎంతప్రేమ ఉంటుందో, ఆళ్లకు కూడా మంగళగిరి ప్రజలపై అలాంటి ప్రేమే ఉందని వెంకన్న దెప్పిపొడిచారు. అటువంటి వ్యక్తి లోకేశ్‌ని, చంద్రబాబుని, భువనేశ్వరి పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పదవీకైపులో ఉన్న ఆళ్ల నోరు అదుపులో పెట్టుకోకుంటే తగినమూల్యం చెల్లించుకుంటాడన్నారు. 

read more  బట్టలు చించేసి, ఒంటిపై గాట్లు పడేలా: పోలీసులపై మందడం మహిళల ఫిర్యాదు

రోడ్లపై ఉన్న రైతుల్ని పరామర్శించే ధైర్యంలేని ఆర్కే అమరావతి రైతులముందుకురాని భారతి, షర్మిల గురించి ఎందుకు మాట్లాడటంలేదన్నారు. లక్షలకోట్లు దోచేసి రూ.43వేలకోట్లు జప్తుచేయబడిన జగన్మోహన్‌రెడ్డి భయపడతాడుగానీ, ఏతప్పు చేయని చంద్రబాబుకి  భయం ఉండదన్నారు. తప్పుడుకేసులు వేస్తేనే కోర్టులు స్టేలు ఇస్తాయన్న విషయం  ఆళ్ల తెలుసుకోవాలన్నారు.  
 
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios