అమరావతి: మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమపై మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ నిప్పులు చెరిగారు. ఆయన పని పాటా లేక  పోరంబోకు మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయనలా తాను నీచ రాజకీయాలు చేయడంలేదన్నారు. కాబట్టి అతడు రాజీనామా చేయమంటే తాను చేయాల్సిన అవసరం లేదని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. 

తాను కూడా కృష్ణాజిల్లా వాసిగా, మైలవరం శాసనసభ్యునిగా  అమరావతి రాజధాని కోసమే కట్టుబడి ఉన్నానన్నారు. తన అభిప్రాయాన్ని పార్టీ వేదికపైనే స్పష్టంగా చెప్పానని అన్నారు. క్రమశిక్షణ గల నాయకుడిగా తాను పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని... వైఎస్సార్ కాంగ్రెస్ రాజధాని కోసం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి  వున్నట్లు తెలిపారు.

తమ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి  నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. అమరావతి రాజధాని సమస్య తన రాజీనామాతో పరిష్కారం కాదని తెలుసుకోవాలన్నారు. 

 read more చంద్రబాబుది క్యాపిటల్ ఉద్యమం కాదు క్యాపిటలిస్ట్ ఉద్యమం: ఎమ్మెల్యే అమర్‌నాథ్

కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దేవినేని ఉమ, టిడిపి నాయకులకు అమరావతి ఉధ్యమం దొరికినట్టుగా ఉందన్నారు. అమరావతి ఉద్యమంతో వీరంతా చలిమంటలు కాచుకుంటున్నారని అన్నారు. అలాంటి వారిలో ఉమ ముందువరుసలో వున్నాడని... ఏదో ఆయనొక్కడే ఉద్యమం చేస్తున్నట్టు పిచ్చి వాగుడు వాగుతున్నాడని మండిపడ్డారు.

''నాది చాలా పెద్ద కుటుంబం. నా కుటుంబ సభ్యులంతా గెలుపు  కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. చివరకు నీ తమ్ముడు కూడా నా విజయం కోసమే ఎన్నికల్లో ప్రచారం చేశారు. ముందు ఈ విషయం గురించి  తెలుసుకో. దిక్కు మొక్కు లేని వాడివి కాబట్టే నీ కోసం ఎన్నికల ప్రచారానికి ఎవరు రాలేదు.'' అంటూ ఉమకు చురకలు అంటించారు.

read more  జగన్ మూడు రాజధానుల నిర్ణయం... బిజెపి ఎంపి టీజి కీలక వ్యాఖ్యలు

''నా తండ్రి, మాజీ హోం శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావుకు కాళ్ళు లేకపోయినా ఎన్నికల్లో నా విజయం కోసం నియోజకవర్గంలోని 100 గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. దేవినేని ఉమా... నీవో రాజకీయ నిరుద్యోగివి. ఉమా నీ టైం ఐపోయింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా నీకు  అవకాశం వచ్చినా ఏం చేయలేక చతికిలపడ్డావు. ఇప్పుడు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు.

రాజకీయ నిరుద్యోగిగా నీవు నిరంతరం దర్నాలు, ఆందోళనలు చేయడమే కదా నీ పని.  నీ పని నీవు చేసుకో. మైలవరం నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా నా పని నేను చేసుకుంటూ పోతాను. మైలవరం శాసనసభ్యునిగా 6 నెలల్లో మేము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీ మానసిక స్థితి సరిచూసుకొ'' అంటూ దేవినేని ఉమపై కృష్ణ ప్రసాద్ విరుచుకుపడ్డారు.