Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుది క్యాపిటల్ ఉద్యమం కాదు క్యాపిటలిస్ట్ ఉద్యమం: ఎమ్మెల్యే అమర్‌నాథ్

టిడిపి అధ్యక్షులు చంద్రబాబు రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేయడం లేదని... కేవలం తన వ్యక్తిగత ఆస్తులను కాపాడుకోడానికే  ఆ  ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నాడని  వైసిపి ఎమ్మెల్యే  అమర్‌నాథ్ ఆరోపించారు. 

ysrcp mla gudiwada  amarnath reddy satires on  chandrababu naidu
Author
Amaravathi, First Published Jan 7, 2020, 3:05 PM IST

విశాఖపట్నం: రాజధానిని అమరావతి నుండి ప్రభుత్వం తరలిస్తోందంటూ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గత 10 రోజులుగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ ఆ ప్రాంత ప్రజల్లో భావోద్వేగాన్ని రెచ్చగొడుతున్నారని అనకాపల్లి వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. అయితే తామెప్పుడు రాజధానిని అమరావతి నుండి తరలిస్తామని చెప్పలేదని... దాంతో పాటు మరో రెండు నగరాలతో కలిపి రాజధానిని ఏర్పాటు చేస్తామని ఆలోచిస్తున్నట్లు చెప్పామన్నారు. 

మంగళవారం హైపవర్‌ కమిటీ సమావేశమవుతోందని... ఆ తర్వాత త్వరలోనే కేబినెట్‌ సమావేశం కూడా జరగనుందన్నారు. వాటిలో విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసం ఉందన్నారు. 

అసలు చంద్రబాబు ఎందుకు అమరావతిలో ఉద్యమం, పోరాటం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని... అమరావతితో పాటు, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, కర్నూలులో జుడీషియల్‌ క్యాపిటల్‌ ఏర్పాటు కావచ్చని మాత్రమే సీఎం జగన్  చెబితే ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు.

రాజధానిలో గతంలో రైతులు 33 వేల ఎకరాల భూములిచ్చారని.... సేకరణ సమయంలో వారికి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పినా ఎందుకు ఈ కృతిమ ఉద్యమం చేస్తున్నారో చెప్పాలన్నారు. దీనికి ఆయన యావత్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మొదటి క్యాపిటలిస్ట్‌ ఉద్యమం ఇవాళ చంద్రబాబు అమరావతిలో చేస్తున్నారని మండిపడ్డారు.

read more  జగన్ మూడు రాజధానుల నిర్ణయం... బిజెపి ఎంపి టీజి కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు క్యాపిటలిస్ట్ ఉద్యమానికి సిద్దాంతాలను వదిలి మరీ వామపక్షాలు వత్తాసు పలుకుతున్నాయని... వారూ సమాధానం చెప్పాలన్నారు. గత కొన్నాళ్లుగా సీపీఐ రామకృష్ణ, మధు మాటలు చూస్తుంటే వారు ఏ రకంగా చంద్రబాబుకు సహకరిస్తున్నారో అర్థమవుతుందన్నారు. వామపక్ష సిద్దాంతాలను వారు ఎందుకలా గబ్బు పట్టిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. 

ఇవాళ రాయలసీమ తాగు, నీటి కోసం ఆరాట పడుతోంది... దాని గురించి అస్సలు పట్టించుకోకుండా చంద్రబాబు అమరావతిలో రేటు పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రాంతంలో పరిశ్రమలు కావాలని చేసిన ఉద్యమాలు చూశాం కానీ అమరావతిలో మాత్రం తమ భూములకు రేటు కావాలని ఉద్యమం చేస్తున్నారని అన్నారు. 

చంద్రబాబుకు బాకా ఊదే పత్రికలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని... ఆయన ఇప్పటి వరకు ఏం చేసినా కొన్ని పత్రికలు, ఛానళ్లు జోరుగా మద్దతునివ్వడం,   ఆకాశానికెత్తడం చేస్తున్నాయన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టవచ్చన్న ప్రభుత్వ ప్రకటనపై చంద్రబాబు అనుకూల దినపత్రికలో ఒక పెద్ద వార్తను పేజీలకొద్ది రాశారు... వారికి ఎంత బాధ కలుగుతోందో ఈ వార్త తెలియజేస్తోందన్నారు.

''గతంలో రాజధానిగా వున్న హైదరాబాద్‌ చాలా దూరమని  ఎప్పుడయినా అన్నామా? ఇప్పుడు దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీ దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి పక్కనే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో పెట్టమని అడిగామా? విశాఖలో ఇవాళ అన్ని సదుపాయాలు ఉన్నాయి. జాతీయ రహదారి ఉంది. రైల్వే, పోర్టు కనెక్టివిటీ ఉంది. పలు విమాన సర్వీసులు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఎందుకు చూడలేకపోతున్నారు?'' అని ప్రశ్నించారు. 

''తనను నమ్మిన వారికి వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. సీఎంగా ఆయన 14 ఏళ్లు పని చేశారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచాడు. ఉత్తరాంధ్ర ప్రజలు తొలి నుంచి టిడిపికి అనుకూలంగా ఉన్నారు. కానీ ఆ పార్టీ నైజం గమనించి మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి పట్టం కట్టారు. ఇన్నాళ్లూ మీకు అండగా నిల్చిన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు ఇదా మీరిచ్చేది? '' అంటూ మండిపడ్డారు.

''చంద్రబాబుకు అనుకూలమైన ఓ ప్రస్థానం మొదలైంది విశాఖలోనే. ఎన్టీఆర్‌ను గద్దె దింపడంలో మీరు ఎలాంటి పాత్ర పోషించాలో తెలియదా? నాడు రవాణా సదుపాయం సక్రమంగా లేనప్పుడే చాలా సులభంగా విశాఖకు వచ్చి పోయే వారు. ఇప్పుడు ఆ సదుపాయాలు బాగా వచ్చాయి. అయినా విశాఖకు వచ్చి పోవడానికి రెండు, మూడు రోజులు పడుతుందా? అంటే పాక్కుంటూ లేదా నడుచుకుంటూ వస్తారా?  విశాఖ అంటే ఎల్లో మీడియాకు ఎందుకంత కడుపు మంట? ఈ నగరంపై ఎందుకంత ద్వేషం?'' అంటూ దినపత్రికపై మండిపడ్డారు. 

Video : అనుమతులు లేవు..అరెస్టులు చేస్తాం...పోలీసుల హెచ్చరిక..

''చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పని చేశారు. విభజన తర్వాత 13 జిల్లాలకు సీఎంగా పని చేశారు. కానీ ఇవాళ ఒక 29 గ్రామాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఒక మండల అధ్యక్షుడి మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఇదేనా ఇన్నేళ్ల మీ రాజకీయ అనుభవం? మీరు జాతీయ నాయకుడని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారని మీ కొడుకు చెబుతా ఉంటాడు. కానీ నిజానికి ఇవాళ జాతీయ రాజకీయాల్లో చక్రం కాదు కదా.. కనీసం బొంగురం కూడా తిప్పే పరిస్థితిలో లేరు.జాతీయ నాయకుడు కాస్తా జాతి నాయకుడిగా మారిపోయాడు.

 ఇక రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు, 5 కోట్ల మంది ప్రజలు ఏమై పోయినా ఫరవాలేదు. ఆ 29 గ్రామాల పరిధిలో ఉన్న భూమలు, వాటి ధరలను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామన్నట్లుగా ఉన్నారు. గతంలో అమరావతికి రాజధానికి ఎంపిక చేసినప్పుడు చందాల వసూలుకు మీరు హుండీలు పెట్టారు. హైదరాబాద్‌లో, అమరావతిలో పెట్టారు. ఇక మీ అనుకూల పత్రికలు కూడా వసూలు చేశాయి. వాటికి లెక్కలు లేవు.

ఆరోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మీ భార్య భువనేశ్వరి ఇవాళ భూముల ధరలు పడిపోతున్నాయని చెప్పి రెండు గాజులు ఇచ్చారు. వాటిని చూపి మళ్లీ ఇవాళ వసూళ్లు మొదలు పెట్టారు. చంద్రబాబు కాస్తా హుండీ బాబుగా మారిపోయారు. '' అంటూ అమర్నాథ్ విరుచుకుపడ్డారు.

''విజయవాడలో నిన్న గద్దె రామ్మోహన్‌ దీక్ష చేస్తుంటే అక్కడ కూర్చుని కట్నాల చదివింపులు చేశారు. దేనికి ఇదంతా? ఎక్కడికి వెళ్తున్నాం? మీ భూముల ధరలు పెంచుకోవడానికి ప్రజల ఉంగరాలు, తాళిబొట్లు ఇవ్వాలా? జీవితంలో ఆఖరి దశకు వచ్చినా ఇంకా ఎందుకీ రాజకీయాలు? 70 ఏళ్లు దాటాయి మీకు. మీరు చేస్తున్న పోరాటాన్ని గాంధీజీ స్వతంత్య్ర ఉద్యమంతో పోలుస్తున్నారు. అసలు గాంధీజీ చేసిన పోరాటం ఏమిటి? ఇవాళ మీరు చేస్తున్నదేమిటి?

గాంధీజీ స్వతంత్య్ర ఉద్యమం చేస్తే ప్రజలు ఇలా డబ్బులిచ్చారని అన్నారు. అసలు ఆయనతో మీరు పోల్చుకోవడం ఏమిటి?  ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైపోయింది మీకు? ఎందుకు ఆ రకంగా మీకు మతిభ్రమించి ఈ రకంగా పోరాటం చేస్తున్నారు? గాంధీజీ ఏనాడూ 29 గ్రామాల కోసమో లేక ఆయన పుట్టిన గుజరాత్‌ కోసమో పోరాటం చేయలేదు. గాంధీజీ నాడు చేసిన స్వతంత్య్ర ఉద్యమం ప్రపంచంలోనే ఆదర్శంగా నిల్చింది.  మరి మీ ఉద్యమం దేనికి ఆదర్శం?

''గబ్బిలం గురించి మనకంతా తెలుసు. నేను పాలిస్తాను. రెక్కలున్నాయి ఎగురుతాను అని చెప్పి పక్షి దగ్గరకు వెళ్లి నేను పక్షిని అని చెబుతుంది. అలాగే పాలిస్తాను కాబట్టి పశువుల దగ్గరకు వెళ్లి  తాను కూడా పశువునే అని చెబుతుంది.  కానీ నిజానికి గబ్బిలం ఎక్కడ తిరుగుతుంది అని చూస్తే మనుషుల అంత్యక్రియలు జరిగే స్మశానాల చుట్టూ తిరుగుతుంది. దెయ్యాలు తిరిగే మర్రి చెట్ల చుట్టూ తిరుగుతుంది. సరిగ్గా ఇవాళ చంద్రబాబు గారు కూడా ఒక రాజకీయ గబ్బిలంలా, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి చెందకుండా ఒక రాజకీయ గబ్బిలంలా తయారయ్యాడు. ''అంటూ అమర్నాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios