కాంగ్రెస్ తల్లిని చంపి పిల్లల్ని వేరుచేస్తే... వైసిపి ఆ పిల్లను కూడా...: మాజీ మంత్రులు
విజయావాడ, కృష్ణా జిల్లా ప్రయోజనాలను స్వయంగా ఈ జిల్లాల వైసిపి ఎమ్మెల్యేలే సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిల వద్ద తాకట్టు పెట్టారని మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్రలు ఆరోపించారు.
అమరావతి: కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం, చేసిన ప్రకటన తమ ఓటర్లనే దెబ్బతీసేలా వున్నాయని మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేల సమావేశ నిర్ణయాలు ఈ రెండు జిల్లాల ప్రజల ప్రయోజనాలే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయన్నారు.
ప్రస్తుత తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు ధీటుగా రాష్ట్రం నడిబొడ్డులో అమరావతిని నిర్మించాలన్నది గత ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమైతే విచ్ఛిన్నం చేయాలన్నది ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిల తప్పుడు నిర్ణయమన్నారు. అమరావతి నుండి రాజధానికి తరలించాలన్న వీరి నిర్ణయాలకు రాజధాని ప్రాంత నాయకులు, ఎమ్మెల్యేలు తలకెత్తుకోవడం దుర్మార్గమన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి అవసరంలేదన్నారు. రైతులు ఇచ్చిన భూముల ద్వారానే రాజధాని నిర్మించవచ్చన్నారు. రాజధానిని విశాఖకు మారిస్తే ప్రభుత్వ ఖజానా నుంచి తలకు మించిన ఖర్చు చేయవలసి వస్తుందని... ఇది రాష్ట్రాభివృద్ధికి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుంటుందన్నారు.
read more దానిపై సిబిఐ విచారణకు సిద్దమా...: విజయసాయి రెడ్డికి బండారు సవాల్
రాజధాని మార్పు అనేది కేవలం జగన్, విజయసాయి రెడ్డిల స్వప్రయోజనాల కోసమేనని... ఇది రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగిస్తోందన్నారు. రైతుల త్యాగాలకు విలువ లేకుండా చేస్తున్నట్లు తెలిసి కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మవంచన చేసుకున్నారని... బేలగా జగన్ నిర్ణయాలను సమర్ధించే స్థితికి దిగజారారని మండిపడ్డారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న 33 ఎమ్మెల్యే స్థానాలలో 30 స్థానాలు వైసీపీని చేతుల్లో ఉన్నాయని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో గెలిచినప్పటికి వైసిపి ప్రభుత్వం రాజధాని మార్పుకు పూనుకుందని... జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆయన మనసు మార్చకపోతే వీరందరి రాజకీయ జీవితం శాశ్వతంగా ముగిసేవిధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు.
read more జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. అంగీకారమే: రాజధాని ప్రాంత వైసీపీ నేతలు
ఆనాడు తల్లిని చంపి బిడ్డను వేరుచేసినట్లుగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ విడగొట్టిందని... దీంతో ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్ లేకుండా చేశారని గుర్తుచేశారు. ఇదేవిధంగా ఎదిగే బిడ్డ తలను ముక్కలు చేస్తున్నా వైసీపీ శాసనసభ్యులకు రాజకీయ భవిష్యత్ ను ప్రజలు శూన్యం చేస్తారని అన్నారు. వారి భవిష్యత్ శూన్యం కాకుండా ఉండాలంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్మోహన రెడ్డి, విజయసాయి రెడ్డిల మనసు మార్చాలని మాజీ మంత్రులిద్దరు సూచించారు.