అమరావతి: భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక  నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో 15 , 16 తేదీల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన శుక్రవారం  నిర్ణయించారు. అందుకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. 

ఆకలితో వున్నవారికి పని కల్పించి కడుపు నింపాల్సిన ప్రభుత్వమేనని అన్నారు. కానీ ఉన్న ఉపాధిని పోగొట్టి కార్మికుల కడుపు మాడ్చేసిందని మండిపడ్డారు.  ఇటువంటి  పరిస్థితుల్లో జనసేన నాయకులు, జనసైనికులు వారికి  అండగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు.

పస్తులుంటున్న కార్మికుల కోసం డొక్కా సీతమ్మ స్పూర్తితో జనసేన పార్టీ తరపున ''డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు' ఏర్పాటు చేస్తామని ప్రకటించారు రోజువారి పనుల కోసం అడ్డాకు కార్మికులు వచ్చే సమయంలో బోజనాన్ని అందించనున్నట్లు తెలిపారు. అడ్డాల దగ్గరే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తామన్నారు.

read more  చంద్రబాబు ఇసుక దీక్ష... ఇందిరాగాంధీ స్టేడియంలో కాకుంటే అక్కడే...: టిడిపి ఎమ్మెల్సీ

తమ పార్టీ వనరులు పరిమితమే కావచ్చు... కానీ  చేతనైనంత సాయం చేస్తామన్నారు.  15, 16 తేదీల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను నిర్వహిస్తామన్నారు.  ఈ శిబిరాలు చూసైనా ప్రభుత్వం కార్మికులకు ఉచితంగా ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేసే ఆలోచన కలగాలని కోరుకుంటున్నామని అన్నారు.

ప్రభుత్వ క్యాంటీన్లు ద్వారా అందిస్తారో మరో విధంగానో... కార్మికులకు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆహారం అందించాలని పవన్ డిమాండ్ చేశారు. నెలల తరబడి పనులు లేకుండా చేసి పస్తులు పెట్టినందుకు కార్మికుల కుటుంబాలకు ఉచితంగా ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే శిబిరాలకు  ఏ రంగైనా వేసుకోండి.. ఏ పేరైన పెట్టుకోండని అభ్యంతరం లేదని పవన్ అన్నారు. 

 ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నవారు 50 మంది వరకూ ఉన్నారని భవన నిర్మాణ కార్మిక సంఘాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వం ఏడు కుటుంబాలకే పరిహారం ఇచ్చారన్నారని....మిగతా అందరికి కూడా ఇవ్వాల్సిందేనని అన్నారు. 

read more  ఇసుక కొరతకు జగన్ ప్రభుత్వం చెక్...

రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరవాత 1200 మంది చనిపోయారని ఏ లెక్కలతో చెప్పారో తెలియదు గానీ ఓదార్పు యాత్రలో వారి ఇళ్లకు వెళ్లి లక్షల రూపాయలు ఇచ్చారన్నారు. ప్రభుత్వ అలసత్వంతో ఉపాధి కోల్పోయి 50 మంది వరకూ చనిపోయారని భవన నిర్మాణ కార్మిక సంఘాలే చెబుతున్నాయని... మరి ఏ లెక్కలతో ఏడు కుటుంబాలకే పరిహారం ఇచ్చి చేతులు దులుపురున్నారో చెప్పాలన్నారు.

ఇల్లు కట్టుకొనే ప్రతి ఒక్కరూ  భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సెస్ చెల్లిస్తారని గుర్తుచేశారు. ఆ సంక్షేమ నిధి నుంచే పరిహారం ఇవ్వండని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు.