Asianet News TeluguAsianet News Telugu

ఇసుక కొరత: లాంగ్ మార్చ్ కు కన్నాను ఆహ్వానించిన పవన్ కల్యాణ్

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై పోరాడేందుకు జనసేన పార్టీ సిద్దమైంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో చేపట్టనున్న లాంగ్ మార్చ్ కోసం పవన్ కల్యాణ్ అన్ని పార్టీల మద్దతును కోరుతున్నారు. 

janasena chief pawan kalyan phone call to kanna lakshminarayana about vizag long march
Author
Vijayawada, First Published Oct 30, 2019, 4:20 PM IST

విశాఖపట్నం:  ఇసుక దొరకక ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్న భవన నిర్మాణ కార్మికులకు అండగా వుంటామని జనసేన పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ను తలపెట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తామని ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆ దిశగా ఓ అడుగు వేశారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించి ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేస్తూ జనసేన నవంబర్ 3వ తేదీన విశాఖలో లాంగ్ మార్చ్ తలపెట్టింది. ఇందులో పాల్గొనాల్సిందిగా బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. అందుకు కన్నా కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

బుధవారం మధ్యాహ్నం కన్నా లక్ష్మీనారాయణకు స్వయంగా పవన్ ఫోన్ చేసి మాట్లాడారు. లాంగ్ మార్చ్ తలపెట్టడానికి గల కారణాలను ఈ సందర్భంగా వివరించి మద్దతివ్వాలని కోరారు. 

read more ఏసిబి అధికారులా.... దారి దోపిడీ దొంగలా...: పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్

ఆగస్టు 4వ తేదీన భీమవరం సమావేశంలో పాల్గొనడానికి రాజమండ్రి నుండి బయలుదేరిన పవన్ వాహనాన్ని ఆపి సిద్ధాంతం వద్ద భవన నిర్మాణ కార్మికులు తమ కష్టాలను తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇసుక దొరకక తమ ఉపాధి పోయిందని వివరించారు. అలాగే మంగళగిరికి వెళ్ళినప్పుడు కూడా కొందరు భవన నిర్మాణ కార్మికులు ఇలాగే తమ బాధలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు.

అయితే కొత్త ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పడంతో సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో కొద్దిగా  వేచి చూశానని...అయితే రాను రాను సమస్య మరింత తీవ్రతరం అవుతుండటంతో పోరాటానికి సిద్దమైనట్లు పవన్ వెల్లడించారు. ఇసుక అందరాని సరుకుగా మారిపోయి చివరకు ఉపాధిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున ఈ సమస్య పరిష్కారం కోసం విశాఖలో లాంగ్ మార్చ్ కు పిలుపు నిచ్చారు.  

అధికారిక లెక్కల ప్రకారం ప్రత్యక్షంగా 17.80 లక్షల మంది, పరోక్షంగా మరో 17 లక్షల మంది ఉపాధి కోల్పోవడంతో ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం, ప్రధాని  మోడీ గారి దృష్టికి కూడా పవన్ తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా చేయాలని పవన్ భావిస్తున్నారు.

read more సొంతజిల్లా అభివృద్దికై... ఇరిగేషన్, పరిశ్రమల శాఖ మంత్రుల భేటీ

ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పక్షాలు కలసి కట్టుగా పోరాడాలని మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ను కొందరు భవన నిర్మాణ కార్మికులు  కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి మీరు చొరవ చూపాలని కోరారు. 

అలాగే తెలంగాణాలో జరుగుతున్న ఆర్.టి.సి సమ్మెలో అక్కడి రాజకీయ పార్టీలు చూపుతున్న సంఘీభావాన్ని, ఐక్యతను ఇసుక సమస్య పరిష్కారంలో కుడా చూపాలని వారు విన్నవించారు. వారి విన్నపానికి సంసిద్ధత తెలిపిన పవన్ ముందుగా కన్నా లక్ష్మి నారాయణ గారితో మాట్లాడి ఇసుక కార్మికులకు మద్దతిద్దామని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios