విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. స్వర్ణ ప్యాలెస్ లో ఈ కోవిడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. దాదాపు 50 మంది కరోనా రోగులు ఈ కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది.

అగ్నిప్రమాదంతో పొగలకు రోగులకు ఊపిరడం లేదు. రోగులు కిటికీల్లోంచి తొంగి చూస్తూ కేకలు వేస్తున్నారు. నలుగురు రోగులు భవనంపై నుంచి దూకారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారు భవనం ఒకటో అంతస్థు నుంచి దూకారు.

Also Read: విజయవాడ కోవిడ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి (వీడియో)

షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కోవిడ్ కేంద్రాన్ని రమేష్ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీపీ శ్రీనివాసులు చెప్పారు. 

సంఘటనా స్థలానికి మంత్రి వెల్లంపల్లి, కలెక్టర్, సీపీ చేరుకున్నారు. సహాయక చర్యలను వారు పర్యవేక్షిస్తున్నారు. అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. మంటలు మొదటి భవనం మొదటి అంతస్థు నుంచి పైకి పాకాయి.