ఏపీ రాజధానిని మూడు ముక్కలుగా ప్రకటించిన వెంటనే  హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వెంచర్ల రేట్లు పెరిగాయన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆదివారం విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన నిరసన దీక్షకు నారాయణ మద్ధతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మూడు రాజధానుల ప్రకటన అనంతరం జగన్ కు తెలంగాణ నుంచి టీఆర్ఎస్ నేతలు ధన్యవాదాలు చెప్పారన్నారు. తెలంగాణ కోసం జగన్ సేవ చేస్తున్నారు తప్ప ఆంధ్రవాళ్ల కోసం కాదని నారాయణ ఎద్దేవా చేశారు.

Also Read:వారికి ఆడి కార్లు, బంగారు గాజులు ఎలా వచ్చాయి.. అదంతా వాళ్ళ పనే: పృథ్వీ

రాజధానిని మార్చుతానని మేనిఫెస్టేలో జగన్ ఎందుకు పెట్టలేదో చెప్పాలని నారాయణ ప్రశ్నించారు. ప్రజల తీర్పు లేకుండా రాజధానిని మార్చే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.

సీఎం జగన్ సహా ఎమ్మెల్యేలంతా వెంటనే  రాజీనామా చేసి.. రాజధానిని మార్చుతామనే ఎజెండాతో ఎన్నికలకు వెళ్లి గెలవాలని నారాయణ సవాల్ విసిరారు. రాజీనామా చేసి తిరిగి గెలిచి అప్పుడు మూడు రాజధానుల పై నిర్ణయం తీసుకోవాలని దుయ్యబట్టారు.

సెక్రటేరియట్ , అసెంబ్లీది  భార్యా భర్తల సంబంధమని రెండూ ఒకేచోట ఉండాలని నారాయణ హితవు పలికారు. కమిటీలోని వాళ్లంతా ఖాళీ కాగితాలను జగన్ కిస్తే ఆయన విజయసాయిరెడ్డితో నివేదిక రాయించారని ఆయన ఆరోపించారు.

Also Read:అమరావతి ఆందోళన: చంద్రబాబుపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

రాజధానిపై వేసిన కమిటీల నివేదికలు నాలుక గీసుకునేందుకు కూడా పనికిరావని ధ్వజమెత్తారు. పిచ్చాసుపత్రుల నుంచి వచ్చిన వారే కమిటీ లో ఉన్నారని అది మెంటల్ కమిటీ అంటూ ఫైరయ్యారు. అమరావతి ఆంధ్రుల హక్కు అనే నినాదం రావాలని.. రాజధాని కోసం చేసే పోరాటానికి కమ్యునిస్టు పార్టీ అండగా ఉంటుందని నారాయణ హామీ ఇచ్చారు.