గుంటూరు: మద్యపాన నిషేధం ముసుగులో జగన్మోహన్‌రెడ్డి భారీదోపిడీకి తెరలేపారని... రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న దుకాణాల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టగా ఆదాయం మాత్రం సీఎం జగన్ ఖాతాలోకి చేరుతోందని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.  ప్రతి 100కేసుల మద్యం కొనుగోలుపై ఉచితంగా వచ్చే 30కేసులు అమ్మగా వచ్చే ఆదాయం మొత్తం ఏపీ సీఎం జేబులోకే వెళుతోందని తెలిపారు. 

గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. మద్యం దుకాణాల్లో వైసీపీ నేతలకు చెందిన లిక్కర్‌ కంపెనీల్లో తయారయ్యే 3,4రకాల బ్రాండ్లనే అమ్ముతున్నారని... వాటిపై కూడా క్వార్టర్‌కు రూ.30 నుంచి రూ.40వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. నిషేధం మాటున పేదలు, మధ్యతరగతిని జగన్‌ సర్కారు కల్తీమద్యానికి బానిసల్ని చేస్తోందన్నారు. 

నాసిరకం మద్యాన్ని ఎక్కువధరకు అమ్ముతూ పెంచిన ధరల ద్వారా వచ్చే మొత్తాన్ని ఏ1, ఏ2లు తమ జేబుల్లో వేసుకుంటున్నారని వెంకన్న మండిపడ్డారు.  పగలంతా రెక్కలుముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని, శ్రమజీవుల రక్తాన్ని జగన్‌ ప్రభుత్వం జలగలా పీల్చేస్తోందన్నారు. మామూలుగా పెంచినరేట్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2 వేలకోట్ల వరకు ఆదాయం వస్తోందన్నారు. 

read more  జగన్ సర్కార్ కీలక నిర్ణయం: ఆ రెండు రాజధాని గ్రామాలు ఇక...

ఆ ఆదాయం అలాఉంటే దుకాణాలకు చెల్లించే అద్దెరూపంలో, ఉచితంగా వచ్చే మద్యం అమ్మకాల ద్వారావచ్చే ఆదాయాన్ని తోడుదొంగలైన జగన్‌, విజయసాయిలు చెరిసమానంగా పంచుకుంటున్నారని బుద్దా స్పష్టంచేశారు. ఇదిలా ఉంటే దుకాణాలు మూసేసిన తర్వాత రాత్రి 8గంటల నుంచి ఉదయం 10మధ్యలో క్వార్టర్‌కు రూ.30, రూ.40వరకు అదనంగా అమ్ముతూ అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు తమజేబులు నింపుకుంటున్నారన్నారు. 

స్వర్గీయ ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలుచేస్తే జగన్ దశలవారీగా చేస్తానంటూ జేట్యాక్స్ రూపంలో ఉచితంగా వచ్చే మద్యం అమ్మకాలద్వారా రూ.10వేల కోట్లవరకు జగన్‌, విజయసాయిల జేబుల్లోకి వెళుతున్నాయన్నారు. పదవుల్లోకి రాకముందే లక్షలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నవారికి ఇలాంటివన్నీ వెన్నతో పెట్టిన విద్యలని బుద్ధాఎద్దేవా చేశారు. 

read more  రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 14వేల మంది రైతులే కారు...మరి ఎవరంటే..: సజ్జల

పన్నులరూపంలో ప్రజలసొమ్ము ప్రభుత్వానికి వెళుతుంటే అవేసొమ్ముని ప్రజలకు ఇచ్చినట్టే ఇస్తూ తిరిగి మద్యం రూపంలో జగన్‌ సర్కారు స్వాహా చేస్తోందన్నారు. మద్యపాన  నిషేధం జగన్‌కు ఆదాయ వనరుగా మారిందనడానికి ఇంతకంటే రుజువులేమీ ఉంటాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మద్యం దుకాణాలను ప్రైవేటువ్యక్తులకే  అప్పగించాలన్నారు.

అన్నాబత్తుని శివకుమార్‌ శిఖండి...

అర్థణాకు ఎక్కువ, బేడాకు తక్కువైన అన్నాబత్తుని శివకుమార్‌ శిఖండిలా ప్రవర్తిస్తూ రాజకీయ పితామహుడైన చంద్రబాబు నాయుడిపై నోరుపారేసుకుంటున్నాడని, అతను తననోరుని అదుపులో పెట్టుకోకపోతే తగినవిధంగా బుద్ధిచెబుతామని వెంకన్న హెచ్చరించారు. సౌమ్యుడిగా పేరున్న అన్నాబత్తుని సత్యనారాయణ కడుపున చెడబుట్టిన శివకుమార్‌ తన తండ్రికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడన్నారు. 

శివకుమార్‌ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని అతనంత మగాడయితే, తెనాలిలో ఎక్కడకు రమ్మంటాడో చెప్పాలని వెంకన్న సవాల్‌ విసిరారు. నోరుందికదా అని రెచ్చిపోతున్న వైసీపీనేతలు తమ పదవులు శాశ్వతం కావనే విషయాన్ని తెలుసుకోవాలని, రెచ్చిపోయేవారందరి జాబితాను చంద్రబాబునాయుడు సిద్ధంచేస్తున్నాడని, వారందరి అంతుచూసి తీరుతామని వెంకన్న తేల్చిచెప్పారు.