గుంటూరు: స్థానిక ఎన్నికల్లో అధికారపార్టీకి ప్రజలచేతుల్లో తగిన పరాభవం ఎదురవుతుందని జగన్ కు ఇప్పటికే అర్థమైందని, ఆ భయంతోనే ఆయన మంత్రులకు గెలుపులక్ష్యాలు నిర్దేశించారని టీడీపీనేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతెలిపారు. 9 నెలల తన వికృత, విధ్వంసపాలన, తన పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చిందన్న వాస్తవం జగన్ కు బోధపడిందని... తాను నియమించుకున్న పీకే బృందం కూడా అదే నిజమని తేల్చడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడిపోయాడన్నారు. అందులో భాగంగానే ఏంచేసైనా ఎన్నికల్లో గెలిచితీరాలని అటు మంత్రులను, ఇటు అధికారయంత్రాంగాన్ని, పోలీసులను ఆదేశించాడన్నారు. 

శుక్రవారం వెంకన్న మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమిపాలైతే, మంత్రులంతా రాజ్ భవన్ బాటపట్టాలని, ఎమ్మెల్యేలంతా ఇంటిబాట పట్టాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలే ఆయనలో ఉన్న ఓటమి భయానికి నిదర్శనమన్నారు. 

ధరల పెరుగుదల, విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక, మద్యం మాఫియా,  పథకాల  రద్దు, భూదోపిడీ, ప్రశ్నించినవారిపై దాడులకు పాల్పడటం వంటి చర్యలతో ప్రజలందరిలో జగన్ పాలనపై ఏవగింపు మొదలైందన్నారు. దాంతో వారంతా స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా... తెలుగుదేశానికి ఎప్పుడు ఓటేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారని వెంకన్న తేల్చిచెప్పారు. 

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికలను జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిపితే ముఖ్యమంత్రి చెప్పినట్లుగా సగం కేబినెట్ ఖాళీ అవుతుందని బుద్దా స్పష్టంచేశారు. అధికార యంత్రాంగం, పోలీసులు, డబ్బు, మద్యం, దౌర్జన్యం, బెదిరింపులు లేకుండా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే కడపలో కూడా టీడీపీనే గెలుస్తుందని, ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయడం ఖాయమని బుద్దా తేల్చిచెప్పారు.  

read more  మాన్సాస్ ట్రస్ట్ వివాదం... మండిపడుతున్న అశోక్ గజపతి రాజు

డబ్బు, మద్యం పెంచి ఎన్నికల్లో గెలిచారని తేలితే వారి పదవులు రద్దు చేస్తామంటున్న జగన్ సర్కారు పరోక్షంగా ఇతర పార్టీలవారిని బెదిరిస్తోందన్నారు. డబ్బు, మద్యం సాకుతో ప్రతిపక్ష పార్టీల సభ్యులను పోటీకి దిగకుండా, ఒకవేళ దిగినా పోటీకి అనర్హులని తేల్చడం ద్వారా వారు ఎన్నికల గోదాలోకి దిగకుండా చేయాలన్న కుట్రపూరిత ఆలోచన ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో పోటీచేసేవారిని భయభ్రాంతులకు గురిచేయాలన్న దుర్బుద్ది జగన్ ప్రభుత్వంలో ఉండబట్టే ఇటువంటి ఆదేశాలు జారీచేస్తోందన్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచబట్టే జగన్ పార్టీకి 151 స్థానాలు వచ్చాయని వెంకన్న చెప్పారు. దాదాపు రూ.5వేలకోట్లు ఖర్చుచేసి మద్యాన్ని ఏరులైపారించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి తాను చేసిందే ఇతరులు కూడా చేస్తారని ఆలోచిస్తున్నాడన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా మంచిచేసి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనస్సులో స్థానం సంపాదించి ఎన్నికల్లో గెలుస్తుంది తప్ప...ఎదుటివారిని భయపెట్టి, ప్రలోభపెట్టి ఆ పనిచేయదని వెంకన్న తేల్చిచెప్పారు. 

నయానో, భయానో ఏం చేసైనా సరే  ఎన్నికల్లో గెలిచితీరాలంటూ మంత్రులకు చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనన్నారు. ప్రజలంతా కరోనా వైరస్ తో భయపడుతుంటే జగన్ ఎన్నికల వైరస్ తో భయపడుతున్నాడని, తమ నాయకుడి పరిస్థితిని అర్థంచేసుకొని మంత్రులంతా రాజ్ భవన్ అడ్రస్ తెలుసుకొని, రెడీగాఉంటే మంచిదని బుద్దా దెప్పిపొడిచారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకే ఓటువేయాలని ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. 

లక్షలకోట్లు దిగమింగిన కేసుల్లో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి హయాంలో ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని భావించడం అత్యాశే అవుతుందని, ప్రజలందరిలో కూడా ఇదే అభిప్రాయం ఉందన్నారు. రూ.43వేలకోట్ల ఆస్తులు జప్తుచేయబడి, 12కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నీతి, నిజాయితీ గురించి మాట్లాడటం, డబ్బు మద్యం లేకుండా ఎన్నికలు జరపమని చెప్పడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. 

read more  ఏపీ స్థానిక ఎన్నికలు: ఢిల్లీలో పవన్ బిజీబిజీ, బీజేపీ పెద్దలతో మంతనాలు

వారంరోజుల వ్యవధిలో టీడీపీ అధినేతపై, నారా లోకేశ్ పై  జరిగిన దాడి జగన్ దర్శకత్వంలోనే జరిగిందని, దాడుల ద్వారా టీడీపీని భయపెట్టాలని చూడటం ఆయన తరం కాదని బుద్దా హెచ్చరించారు. ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యముంటే స్థానిక ఎన్నికలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిపించాలని, పోలీసులు, అధికారులు, వాలంటీర్ల ను వినియోగించకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని బుద్దా సూచించారు. 

జగన్ బారినుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కో వ్యక్తి సైనికుడిలా పనిచేయాలన్నారు. వైసీపీప్రభుత్వం చేతగాని ప్రభుత్వమని ప్రజలకు అర్థమైందని, జనానికి కీడుచేయడం తప్ప జగన్ సర్కారుకు మేలుచేయడం తెలియదన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఎన్నికలు సజావుగా జరగవనే అభిప్రాయం ప్రజలందరిలోనూ ఉందని, గెలుపుకోసం అధికారపార్టీవారు ఎంతకైనా తెగిస్తారన్న భయం రాష్ట్రవాసుల్లో ఉందని బుద్దా వెంకన్న స్పష్టంచేశారు.