ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగిన నేపథ్యంలో బీజేపీ-జనసేన సీట్ల పంపకం తదితర రాజకీయ అంశాలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు.

భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రెండు పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎలా పోటీ చేయాలన్న దానిపై సుధీర్ఘంగా చర్చించామన్నారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... ఈ నెల 8వ తేదీన విజయవాడలో ఇరు పార్టీల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Also Read:బీజేపీతో పొత్తు ఖరారు, 2024లో మాదే అధికారం: పవన్

బీజేపీ-జనసేన పొత్తును విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి, చక్కని ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. ఈ నెల 12 ఇరు పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్తంగా మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తామని నాదెండ్ల చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తామని మనోహర్ వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శనివారం షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్. పరీక్షలు, కరోనా వైరస్ లాంటి అంశాలను పరిగణనలోనికి తీసుకున్నామన్నారు.  

పార్టీల నుంచి వచ్చిన అభ్యర్ధనలను సైతం పరిగణనలోనికి తీసుకున్నామని రమేశ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు వాతావరణం అనుకూలంగా ఉందని భావించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని రమేశ్ స్పష్టం చేశారు. 

ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణ సున్నితమైన అంశం కావడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించామని ఆయన వెల్లడించారు. ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలి, సిబ్బంది, బందోబస్తుపై ఇప్పటికే అధికారులతో చర్చించామని రమేశ్ వెల్లడించారు.

Also Read:ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు: సీఏఏకు జై కొట్టిన పవన్

పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని, ఫాస్ట్ ట్రాక్‌లో కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో గతంలో ఉన్న కుల ధృవీకరణ పత్రాలన్నీ చెల్లుతాయన్నారు. పార్టీల అభిప్రాయం మేరకు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని, ఏ పార్టీ కూడా ఈవీఎంలు కావాలని అడగలేదని రమేశ్ తెలిపారు.