అలా చేశామని నిరూపిస్తే దేనికైనా సిద్దమే... చంద్రబాబుకు బొత్స సవాల్
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వేదికన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఆయన సత్యదూరమైన మాటలతో ప్రభుత్వంపై అనవసరంగా నిందలు వేస్తున్నారని బొత్స మండిపడ్డారు.
అమరావతి: అసెంబ్లీలో విపక్షనాయుకుడు చంద్రబాబు అన్నీ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతున్నాడు కదా మధ్యలో జోక్యం చేసుకోవడం బాగోదని అనుకున్నానని...కానీ ఆయన అసత్యపు మాటలు వినలేక అడ్డుతగలాల్సి వచ్చిందన్నారు.
''రాజధానిపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్‌ను తానే డెవలప్ చేశానని...హైటెక్ సిటీ తానే కట్టానంటారు. హైటెక్ సిటీకి ఎవరు పౌండేషన్ స్టోన్ వేశారు అధ్యక్షా, ఎన్ జనార్ధనరెడ్డి చేశారు. ఆయన పౌండేషన్ వేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎవరు కట్టారు అధ్యక్షా, ఈయన కట్టారా...
ఎయిర్ పోర్టు ఎవరు కట్టారు... దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో ఇవన్ని పూర్తయ్యాయి.
ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ గురించి చెప్తున్నారని.... స్విస్ ఛాలెంజ్ ఇచ్చామని చూపిస్తే దేనికైనా నేను బాధ్యత వహిస్తానని విపక్షానికి సవాల్ విసురుతున్నా. ఎందుకు రోజూ ఇన్ని అబద్దాలు చెబుతారు. నాకు విపక్షనాయకుడు పక్కన సీటిచ్చి కూర్చోబెట్టారని, రోజూ ఆయన అబద్దాలను వినలేకపోతున్నాను'' అంటూ బొత్స వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
read more చంద్రబాబుకు జగన్ తో పోలికా... ఆయనకు ఒకటే కానీ మాకు...: వైసిపి ఎమ్మెల్యేలు
ముందుస్విస్ ఛాలెంజ్ అన్నారని, ఇప్పుడు ఎంఓయూ అంటున్నారని ఇప్పటికిప్పుడు మాట మార్చేస్తున్నారన్నారు. ఆయన బాధేంటో నాకు అర్ధం కావడం లేదన్నారు.
సింగపూర్ కంపెనీ ప్రతినిధులు, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు, మూడు సార్లు వచ్చి కలిసారని, మా ఫైనాన్స్ మినిస్టర్‌ని కూడా కలిసారని గుర్తు చేశారు.
తాను కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, మేం చెప్పింది ఒక్కటేనని, మీరు చేస్తానంటే మాకు ఏ మాత్రం అభ్యంతరం లేదన్నామన్నారు. కానీ మీరు ఏ విధంగా చేస్తారు. స్విస్ ఛాలెంజ్ అన్న దాని మీద మాకు అభ్యంతరం ఉందని వారికి చెప్పామన్నారు. అయినప్పటికీ కూడా మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తామంటున్నారు కదా, దాని ప్రజెంటేషన్ మాకు ఇవ్వమని అడిగామని, దీంతో పది రోజుల్లో వస్తామని వెళ్లిపోయారన్నారు.
మరోసారి వచ్చినప్పుడు మీ ప్రజెంటేషన్ ఇవ్వండి, మీరు ఏదైతే చంద్రబాబునాయుడు ప్రభుత్వంతో ఏంఓయూ చేసుకున్నారో, ఆ ఎంఓయూను మీరు ఏ విధంగా అచీవ్ అవుతారు, ఆ విషయం మాకు చెప్పండని ప్రశ్నించామన్నారు. మేం కానీ దాన్ని రీయలైజ్ అయితే, తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పామన్నారు. ఇదే విషయాన్ని పదే, పదే చెప్పామన్నారు. కానీ ఆ కంపెనీలతో మీరు చేసుకున్న ఒప్పందం లోపభూయిష్టం, అందులో మీ వెస్ట్రన్ ఇంట్రెస్ట్‌తో పాటు బోలెడు అంశాలున్నాయన్నారు. దీంతో ఈ విషయాన్ని మేం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు.
మరోవైపు వాళ్లే స్వయంగా మ్యూచివల్‌గా, కన్సర్న్‌తో విడిపోదామని చెప్పిన విషయాన్ని పురపాలకశాఖ మంత్రి వెల్లడించారు. అయితే మొత్తం ఎంత ఖర్చయిందో అంతా ఇవ్వాలన్నారని, అయితే ఒక్క పైసా ఇవ్వమని చెప్పామన్నారు. అప్పుడు ఢిల్లీలో ఉన్న పెద్దలందరూ జోక్యం చేసుకుని, వాళ్లేదో అంటున్నారంటే ఒక మ్యూచివల్ అండర్ స్టాండింగ్‌కు వచ్చామని చెప్పారు. ఏదైతే ఖర్చు ఉందో దాన్ని దామాషా ప్రకారం ఒక జెంటిల్మెన్ ఆగ్రిమెంట్‌కు వచ్చి, ఫైనాన్స్ మినిస్టర్ సింగపూర్ కాన్ఫరెన్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ చర్చించి ఒక అంగీకారానికి వచ్చామన్నారు.
read more జగన్ నిర్ణయంతో జనానికి ముప్పు తిప్పలే: మూడు రాజధానులపై బాబు వ్యాఖ్యలు
చంద్రబాబు ఎందుకు ఇన్ని అబద్దాలు, ఎందుకు ఇన్ని మాటలు చెపుతారని, చేసిన తప్పు ఒప్పుకోమని డిమాండ్ చేశారు. వీళ్లు చేసిన దానికి సుప్రీం కోర్టుతో సహా దేశమంతా ఆక్షేపించాయని, కేల్కర్ కమిటీ చెప్పిన దాన్ని కూడా వీళ్లు పెడచెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అచ్చెన్నాయుడుకి ఇవన్నీ అర్ధం కాదని, ఆయనకు అన్నీ దోచేయడం, తినేయడం ఇసుక లారీకి పదివేలు తీసుకోవడం మాత్రమే అర్ధమవుతాయన్నారు.
మరోవైపు చంద్రబాబునాయుడు మాత్రం ఏం చెపుతారు, ముందు జీ 2 జీ(గవర్నెంటు టు గవర్నమెంట్) అన్నారు, తర్వాత స్విస్ ఛాలెంజ్ అన్నారు తర్వాత రస్సల్‌ఖైమా అన్నారు. అది అయిపోయింది ఇప్పుడు వాన్‌పిక్‌కు కూడా ఇస్తామన్నారు. వాన్‌పిక్‌కు స్విస్ ఛాలెంజ్ ఇచ్చారు అని నిరూపించమనండి, లేదు జీ 2 జీ ఇచ్చారో చెప్పమనండి అని బొత్స ఛాలెంజ్ చేశారు. ఇన్ని అబద్దాలు చెపుతున్నందుకు మీకే నోబుల్ ప్రైజులు, ఆస్కార్ అవార్డులు ఇవ్వాలన్నారు.
ఒక దానికొకటి మీరే మాట మారుస్తున్నారు తప్ప మేమేం మాట మార్చడం లేదని విపక్ష సభ్యులకుగట్టిగా బదులిచ్చారు. మేం ఒకే మాటమీద మాట్లాడుతున్నామన్న బొత్స, ఈయన ఆ రోజు (ప్రతిపక్షనాయకుడు నుద్దేశించి) మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన ఖర్మ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముందు నేను ఏం చెప్పానంటే ఆ రోజు జరిగింది స్విస్ ఛాలెంజ్ కాదు ఏంఓయూ అంటే మరలా మాట మార్చి ఏంఓయూ అన్న విషయాన్ని గుర్తు చేశారు.
మరలా ఇప్పుడేమంటున్నారు స్విస్ ఛాలెంజ్‌కి, జీ 2 జీ ఎంఓయూకి తేడా తెలియదన్నారని, ఆ తేడా తెలుసు కాబట్టి, ఆ సమయంలో మంత్రిగా ఉన్నాం కాబట్టి లేచి ఆయన చెబుతుంది సత్యదూరమని చెప్పానన్నారు.
రాష్ట్ర విభజన వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరగలేదని, దానికంటే ఈయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం ఇంకో ఇరవై సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ఇది వాస్తవమని, ఐదుకోట్ల మందిలో ఏ ఒక్కరిని అడిగినా ఈ విషయం చెప్తారన్నారు. ఆ ఆక్రోషం, బాధ వల్లే ఇవాళ వీళ్లను 20మందితో కూర్చోబెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ విపక్ష సభ్యులనుద్ధేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.