Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో మాత్రం జగన్ చరిత్రకెక్కడం ఖాయం: బోండా ఉమామహేశ్వరరావు

టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, వైసిపి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డిల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పటికే ఆర్కే విషయంలో సవాళ్లు  ప్రతిసవాళ్లు అయిపోగా తాజాగా మరోసారి బోండా ఆరోపణలు  చేశారు.  

bonda umamaheswara rao slams alla ramakrishna reddy
Author
Vijayawada, First Published Jan 3, 2020, 9:55 PM IST

అమరావతి : సీఆర్డీయే పరిధిలో తనకు భూములున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి  అంటున్నారని, మరి 2019 ఎన్నికల్లో ఆయన ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫడవిట్‌లో పేర్కొన్న భూములెవరివో చెప్పాలని టీడీపీ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.  

గురువారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి  ఎన్నికల సంఘానికి ఇచ్చిన 2019 అఫడవిట్‌లో సీర్డీయే పరిధిలో ఆయన పేరుతో వివిద సంవత్సారాల్లో  2018 వరకు కొనుగోలు చేసిన భూమి  62.98 సెంట్లు, ఆయన భార్య రాధ పేరుతో 8 ఎకరాలు భూమి ఉందని పేర్కొన్నారు. రామకృష్ణారెడ్డి తన  ఆస్తులు మర్చిపోతే ఆయన ఒకసారి ఎన్నికల అఫడవిట్‌ చెక్‌ చేసుకోవాలని సూచించారు.

గుంటూరు  జిల్లాలోని పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ,  పిరంగిపురం, గుంటూరు, నల్లపాడు, తాళ్లూరు, వేమవరంలలో ఆయనకు ఆస్తులున్నాయి.  రాజధాని పరిధిలో వేల ఎకరాల భూములు వైసీపీ నేతలకు ఉంటే  మరో వైపు టీడీపీ నేతలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ ఆరోపించటం విడ్డూరంగా ఉంది. రాజధానికి రైతులిచ్చిన భూములన్ని ఒకే సామాజికవర్గం వారివంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు.

 రైతులిచ్చిన 33 వేల ఎకరాలలో కమ్మసామాజిక వర్గం వారివి కేవలం 7 వేల ఎకరాలు మాత్రమేనని వెల్లడించారు. మిగతా 26 వేల ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ కాపులవేనన్నారు.  కానీ  వైసీపీ నేతలు ఒక సామాజిక వర్గం పేరుతో రాజధానిని చంపే ప్రయత్నం చేస్తున్నారని... వారి వైఖరిని రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు.

read more  మందడం మహిళలపై పోలీసులు దాడి... జాతీయ మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు

5 కోట్ల ఆంధ్రుల ఏకాభిప్రాయంలో ఏర్పాటైన రాజధాని అమరావతిపై  ఈ ప్రభుత్వం మళ్లీ జీఎన్‌రావు, బీసీజీ, హైపవర్‌ కమిటీలు వేయటం ఎందుకని ప్రశ్నించారు.  ఆర్డీవో క్యాడర్‌ అధికారి, రిటైర్డ్‌ ఐఎఎస్‌ జీఎన్‌ రావుకు గతంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని ఎంపిక చేసిన చరిత్ర ఉందా అని నిలదీశారు. న్యూయార్క్‌ దగ్గరల్లో ఉన్న  బోస్టన్‌ నగరం వారు మన  రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలో సూచించడం విడ్డూరమని... బీసీజీ గ్రూప్‌పై ఇంటర్‌పోల్‌ అధికారులు కేసులు పెట్టారని ఉమ ఆరోపించారు. 

ఇంటర్ పోల్ కేసుల్లో ఈ కంపెనీ  డైరక్టర్లను కూడా అరెస్ట్‌ చేయటం జరిగిందన్నారు. ఇలాంటి బోస్టన్‌ కమిటి పేరుతో బోగస్‌ కమిటీ వేసి జగన్‌ మనసులో అంశాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  ప్రమాణస్వీకారం చేసిన నాడే రాజధాని అమరావతిని చంపేయాలని జగన్‌ నిర్ణయం తీసుకున్నారని... ఇది తెలియడానికి ప్రజలకు 6 నెలలు పట్టిందన్నారు.

వైసీపీ నేతలు టీడీపీపై చేసిన  ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు  నిరూపించాలంటూ తాము సవాలు విసరటంతో వారు దాని గురించి మాట్లాడటం మానేశారన్నారు.  టీడీపీ  పాలనలో అవినీతి జరిగిదంటూ గతంలో రాష్ట్రం మొత్తం ప్రచారం చేసిన జగన్‌ అధికారంలోకి వచ్చి 7 నెలలయినా ఎందుకు నిరూపించలేకపోయారు?అని ప్రశ్నించారు. 

read  more  జగన్ భార్య భారతిపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

ప్రతి శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ ఇవాళ సీబీఐ కోర్టు పేర్కొందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి హోదాలో కోర్టు మొట్లు ఎక్కిన వ్యక్తిగా జగన్‌ చరత్రకెక్కనున్నారని ఎద్దేవా చేశారు. ఈ విధంగా జగన్‌ రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు.

సెబీ రూల్స్‌ ప్రకారం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనేది కంపెనీలకు సంబందించినదని...రాజధానికి వర్తించదన్నారు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని వైసీపీ ఒక పథకం ప్రకారం దెబ్బతీస్తోందని...రాజధాని పరిరక్షణ కోసం ఉద్యమం చేసే అన్ని సంఘాలకు టీడీపీ మద్దతు తెలిపి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టయినా అమరావతిని కాపాడుకుంటామని బోండా ఉమమహేశ్వరావు స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios