విజయవాడ: గుంటూరు జిల్లా మాచర్లలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై ప్రత్యర్ధులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  శ్రేణులే చేశాయని ఆరోపిస్తూ టిడిపి అధినేత చంద్రబాబు లా అండ్ ఆర్డర్ డీజీ రవి శంకర్ ఫిర్యాదు చేశారు. అయినప్పటికి ఈ ఘటనపై పోలీసులు సీరయస్ యాక్షన్ తీసుకోకపోవడం వల్లే మరోసారి విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు ను కలిసి ఫిర్యాదు చేసినట్లు టిడిపి  నాయకులు బోండా ఉమ తెలిపారు.  

విజయవాడ సిపిని కలిసిన తర్వాత బోండా ఉమ మాట్లాడుతూ... రాష్ట్రం లో రౌడీ రాజ్యం కొనసాగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసిపి అరాచకాలకు పాల్పడుతోందని... టిడిపి అభ్యర్థులను నామినేషన్లు వెయ్యనివ్వకుండా పత్రాలను లాక్కుని చించేస్తున్నారని ఆరోపించారు.

నామినేషన్లకు చివరి రోజయిన బుధవారం మాచర్లలో తమపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలందరూ‌ చూశారన్నారు. ఇది సాధారణంగా జరిగిన దాడి కాదని... ఎన్నికల ముసుగులో తమను చంపడానికే జరిగిందని ఆరోపించారు. మాపై హత్యాయత్నం జరిగింది మాచర్లలో అయినా స్కెచ్ మాత్రం తాడేపల్లి కార్యాలయం నుంచే జరిగిందన్నారు. 

read more  మాచర్లలో బొండా, బుద్దాలపై దాడి: డీజీపీ కార్యాలయం ముందు బాబు ధర్నా

మమ్మల్ని చంపాలని మూడు చోట్ల ప్రయత్నం చేసినా అదృష్టవశాత్తు ప్రాణాలతో‌ బయటపడ్డామని అన్నారు. తనతో పాటు బుద్దా వెంకన్న స్వల్ప గాయాలతో  బయటపడగా తమతో పాటు కారులో  వున్న హైకోర్టు న్యాయవాది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.  

ప్రభుత్వం తన‌ సొంతానికి  పోలీసు వ్యవస్థ ను‌ వాడుకుంటోందని ఆరోపించారు. మాజీ సిఎం‌ చంద్రబాబు వచ్చినా డిజిపి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. 
అడిషనల్ డిజికి అన్నీ వివరించామని... అయినా సరయిన రీతిలో‌ విచారణ జరగలేదని... మొక్కుబడిగా కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ లను రాజకీయాల్లో లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

పోలీసులకు తాము సమాచారం ఇచ్చి బయలు దేరగా వారు వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి వర్గాలని సమాచారం ఇచ్చారని అన్నారు. అందువల్లే తాము ఎక్కడున్నామో పక్కా సమాచారం అందుకుని ఓ పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. ఇప్పటికే డిజిపికి అన్ని విషయాలు తెలియచేసినా ఎలాంటి స్పందన లేదని... అందువల్లే పోలీసులపై నమ్మకం పోయిందన్నారు. 

read more  ఎన్నికల రీషెడ్యూల్ కు డిమాండ్...ఎన్నికల కమీషనర్ కు చంద్రబాబు లేఖ

పోలీసులే  తమ సమాచారాన్ని వైసిపి నాయకులకు చేర వేస్తున్నారని అన్నారు. చంద్రబాబుతో సహా అందరు టిడిపి నేతల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. ఈ హక్కు ఎవరిచ్చారు...? ఇలా చేయడం కంటే చంపేయడమే మంచిది... అయినా రేపయినా మమ్మల్ని‌ చంపాలని చూస్తారు అని బోండా ఉమ ఆరోపించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ను కలిసి ప్రభుత్వం అరాచకాలపై ఫిర్యాదు చేయనున్నట్లు ఉమ వెల్లడించారు.  

రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్ట్ లు పెట్టి అక్రమాలు నియంత్రించడంలో ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని సూచించారరు. తమను బెదిరిస్తూ అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. మీడియా కూడా ఉన్నవి ఉన్నట్లుగా కథనాలు ఇవ్వాలని సూచించారు. తమకు ఏం జరిగినా పోలీసు వ్యవస్థే బాధ్యత వహించాలని... ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎవరెవరికో ప్రభుత్వం గన్ మెన్లను ఇచ్చింది... అలాగే తమకు కూడా ఇప్పించాలని కోరుతున్నట్లు బోండా ఉమ తెలిపారు.