అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ స్థానికసంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే నామినేషన్ల చివరిరోజు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలతో పాటు ఇతర పార్టీల నాయకుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 

ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలుచోట్ల ఇరువర్గాలు( వైసిపి, టిడిపి) బౌతికదాడులకు దిగడంతో నామినేషన్లు వేయలేకపోయారు. దీంతో ఇలా ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు టిడిపి అధ్యక్షులు చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు చంద్రబాబు లేఖ రాశారు. 

read more  మాచర్లలో బొండా, బుద్దాలపై దాడి: డీజీపీ కార్యాలయం ముందు బాబు ధర్నా

టిడిపి తరపున ఎన్నికల బరిలోకి దిగాల్సిన అభ్యర్ధులపై అక్రమ కేసులు బనాయించడమే కాదు నిన్న(బుధవారం) నామినేషన్ వేయడానికి వెళితే చేతుల్లోంచి పత్రాలను లాక్కుని చించివేసి నామినేషన్ వేయకుండా చేశారని ఆరోపించారు.  ఇలా జరిగిన దాదాపు 154 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల రీ షెడ్యూల్ చేయాలని కమీషనర్ ను కోరారు. అలాగే 6 జెడ్పిటిసి స్థానాల్లో కూడా అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదని... అక్కడ కూడా ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

గుంటూరు జిల్లా మాచర్లలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లపై దాడికి నిరసనగా ఏపీ డీజీపీ కార్యాలయం ముందు బుధవారం రాత్రి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణలు ధర్నాకు దిగారు. డిజిపి కార్యాలయంలోకి వెళ్లడానికి పోలీసులు నిరాకరించడంతో రోడ్డుపైనే  బైఠాయించి నిరసన  తెలిపారు. 

మాచర్ల దాడి: డిజిపి కార్యాలయానికి చంద్రబాబు పాదయాత్ర, రోడ్డుపైనే నిరసన (ఫోటోలు)