గుంటూరు: ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చెందిన రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చిన మంత్రి బొత్స సత్యనారాయణను మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్‌ చేశారు.  మంగళవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసిపి ప్రభుత్వం వైఖరేంటో మంత్రి బొత్సా వ్యాఖ్యలతోనే స్పష్టమయ్యిందని ఆరోపించారు. 

అమరావతి నగరాన్ని సైబరాబాద్‌లా నిర్మించాలని గత ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంకల్పించారని అన్నారు. రాజధాని నగరంలో దాదాపు 35 లక్షల మందికి శాశ్వత నివాసం, 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించారని తెలిపారు. దీంతో నగరం బాగా అభివృద్ది చెందితే దాని ద్వారా వచ్చిన ఆదాయంతో 13 జిల్లాలు అభివృద్ధి.... సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని చంద్రబాబు భావించారన్నారు.  

''రాజధానిలో 9 నగరాలు నిర్మించాలని 60 శాతం పనులు పూర్తి చేశారు. కానీ వైసీపీ నేతలు రాజధానిపై ఇష్టం వచ్చినట్లు దుష్ర్పచారం చేస్తున్నారు. రాజధానిపై వైసీపీ నేతలు నక్క పురాణం చెప్పారు. రాజధాని ముంపుకు గురవుతుందని, వరద వస్తుందని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అవినీతి జరిగిందని రకరకాల ఆరోపణలు చేశారు. కానీ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు'' అని అనురాధ పేర్కొన్నారు. 

READ MORE  కాల్ సెంటర్ నంబర్ 14500 కాదు 43000 పెట్టాల్సింది...: బుద్దా వెంకన్న సెటైర్లు

ఇక మంత్రి బొత్సా సత్యనారాయణ ఏకంగా అమరావతిని శ్మశానంగా వర్ణించడం సిగ్గుచేటన్నారు.  25 రోజుల్లో 33 వేల ఎకరాలు రైతులచ్చిన ప్రాంతాన్ని శ్మశానంతో పోలుస్తారా? 29 గ్రామాల ప్రజలు నివిసిస్తున్న ప్రాంతాన్ని శ్మశానం అంటారా? అని ఆమె ప్రశ్నించారు. 

రాజధాని అమరావతిలో ఇప్పటికే హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలు జరిగాయని గుర్తుచేశారు. వాటిని కూడా శ్మశానంతో పోలుస్తారా? అని అన్నారు.  గతంలోనూ రాజధానికి హైమావతి, భ్రమరావతి అంటూ అవమానించారని... ఇప్పుడమే ఏకంగా శ్మశానం అంటూ కించపరుస్తున్నారమని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజధానిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని  బొత్సాను మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు.  లేకుంటే బొత్సా వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. 

READ MORE  అది బొత్సా దిగజారుడుతనానికి నిదర్శనం: సోమిరెడ్డి

రాష్ట్రంలో మంత్రులు, స్పీకర్‌, ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు వింటుంటే.. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారా లేక బూతుల మీడియం ప్రవేశపెట్టారా అనే అనుమానం కలుగుతోందన్నారు. మంత్రులు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారని... విద్యారుల్ని, నిరుద్యోగుల్ని ఒక మంత్రి ఏకంగా కుక్కలు, పశువులతో పోల్చారని గుర్తుచేశారు.

తన నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఏకంగా స్పీకర్‌ మహిళలలను అవమానపరిచేలా మాట్లాడతారా? రాజ్యాంగబద్దమైన, బాధ్యతాయుతమైన స్పీకర్‌ ఇలాగేనా మాట్లాడేది? వైసీపీ నేతల నుండి బూతు పురాణం తప్ప ఒక్కటైనా మంచిమాట వచ్చిందా? ఈ మంత్రుల వ్యవహారశైలి చూసి ప్రజలు ఇది మంత్రివర్గం కాదు, 'కంత్రి'వర్గం అనుకుంటున్నారని అనురాధ విమర్శించారు. 

బొత్సను వెంటనే మంత్రిమండలి నుండి బర్త్‌ రప్‌ చేయాలని...  స్పీకర్‌ మహిళలకు క్షమాపణ చెప్పాలని కోరారు. మంత్రులు, స్పీకర్‌ ఈవిధంగా బూతులు మాట్లాడుతుంటే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారు.... విని ఎంజాయ్‌ చేస్తున్నారా? లేక ఆయనే ఇలా మాట్లాడిస్తున్నారా?  అని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.