విజయవాడ: పుష్కలంగా వర్షాలు కురుస్తుండటంతో ఏపీలో పొలం పనులు ఊపందున్నాయి. ఇదేక్రమంలో ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. పొలం పనులకు వెళుతున్న రైతులు, రైతు కూలీలు పాముకాట్లకు గురవుతున్న సంఘటనలు కోస్తా జిల్లాలో మరీ ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో ఆరుగురు రైతు కూలీలు పాముకాటుకు గురయ్యారు.  

కృష్ణా జిల్లా మొవ్వ మండలకేంద్రంలో రైతు కూలీలు పొలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యారు. దీంతో బాధితులను హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి సరయిన సమయంలో చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. 

read more   బంగాళాఖాతంలో అల్పపీడనం.... కోస్తాలో భారీ వర్షాలు (వీడియో)

ఈనెలలో ఇప్పటివరకు 59 మంది రైతు కూలీలు పాము కాటుకు గురయ్యారని మొవ్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు శివరామ కృష్ణ తెలిపారు. పాముకాటుకు గురవగానే కొందరు బాధితులు నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారని... ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. 

పాము కాటుకు గురైన 15 నిముషాల్లో వైద్యం అందిస్తే ప్రాణాపాయం ఉండదని... అయితే నాటువైద్యుల దగ్గరకు వెళ్లి కాలయాపన చేసేసరికి ప్రమాద తీవ్రత ఎక్కువయ్యే అవకాశం వుంటుందన్నారు. కాబట్టి పాముకాటుకు గురయిన వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు బాధితున్ని తరలించడమే అత్యుత్తమమని డాక్టర్ శివరామ కృష్ణ తెలిపారు.