విజయవాడ: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా కోస్తాంధ్రపై ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా వుంది. శనివారం నుండి కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు. 

కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ కుండపోత కారణంగా నగరంలోని వీధులు, రోడ్లన్ని జలమయమయ్యాయి. వర్షపు నీరు భారీగా చేరడంతో కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఇంకా కొనసాగుతోంది. రోడ్లపైకి భారీగా చేరుకున్న నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  

వీడియో

ఇటీవల కృష్ణా జిల్లా మైలవరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. దేవుని చెరువులో నుండి వరద నీరు నివాస గృహాలలోకి చేరింది. జి.కొండూరు మండలం కుంటముక్కల అడ్డరోడ్డు వద్ద కొండవాగు పొంగి రహదారిపై జల సముద్రంగా మారి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ఈ మధ్య కాలంలో జిల్లాలో ఇంత భారీ వర్షం పడలేదని స్థానికులు అనుకుంటున్నారు.  మరికొన్ని రోజులు ఇలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం వుందన్న హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తమవుతున్నారు.