konaseema violence : నివురుగప్పిన నిప్పులా అమలాపురం... భారీగా పోలీసుల మోహరింపు
అమలాపురం: ఇటీవలే కొత్తగా ఏర్పడిన కొనసీమ జిల్లా పేరును వైసిపి ప్రభుత్వం మార్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
అమలాపురం: ఇటీవలే కొత్తగా ఏర్పడిన కొనసీమ జిల్లా పేరును వైసిపి ప్రభుత్వం మార్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొనసీమ యువత ఆందోళనతో మంగళవారం అమలాపురంలో అట్టుడికింది. పోలీసులపై దాడి చేయడమే కాదు కలెక్టరేట్, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లపై ఆందోళనకారులు దాడిచేసారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు లాఠీచార్జ్ జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు.అయితే ఇవాళ(బుధవారం) అమలాపురంలో పరిస్థితి నివురగప్పిన నిప్పులా వుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కోనసీమ జిల్లా వ్యాప్తంగా పోలీసులు కర్ఫ్యూ విధించారు. చుట్టుపక్కల జిల్లాలనుండి అమలాపురానికి భారీగా పోలీసు బలగాలను రప్పించారు. ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. పుకార్లు ప్రచారం కాకుండా ఇంటర్నెట్ సేవలను నిలుపివేసారు. సిసి ఫుటేజ్, మీడియా, పోలీసులు తీసిన వీడియోల ద్వారా విధ్వంసం సృష్టించిన వారిని గుర్తిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోగా మరికొందరి కూడా గుర్తించి అరెస్ట్ కోసం ప్రత్యక బృందాలు ఏర్పాటుచేసారు.