చిత్తూరు: సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. వర్షిత హత్య కేసులో నిందితుడు రఫీని పోలీసులు అరెస్టు చేశారు. అతను మదనపల్లె మండలం బసినికొండకు చెందిన లారీ డ్రైవర్ రఫీగా పోలీసులు గుర్తించారు. అతన్ని ఛత్తీస్ గడ్ లోని జగదల్ పూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 

ఈ నెల 8వ తేదీన చిత్తూరు జిల్లా కరబలకోట చేనేత నగర్ లో కల్యాణ మండపం వద్ద బంధువుల పెళ్లికి హాజరైన వర్షిత అదృశ్యమైంది. మర్నాడు పొలాల్లో శవమై తేలింది. చిన్నారిపై అత్యాచారం చేసి ఆమెను చంపేశాడని ఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పారు. 

Also Read: పెళ్లింట విషాదం.. ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య

గతంలో కూడా రఫీ ప్రవర్తన బాగా లేదని భార్య వదిలేసి వెళ్లిపోయిందని ఆయన చెప్పారు. గతంలో ఇద్దరు చిన్నారులపై రఫీ అత్యాచారం చేశాడని అన్నారు. ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి గ్రామస్థుల చేత దెబ్బలు కూడా తిన్నాడని అన్నారు. ఆరేళ్ల క్రితం ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసు అతనిపై ఉందని తెలిపారు. 

కల్యాణ మండపంలో వర్షిత ఆడుకుంటూ ఉండగా, ఫొటోలు తీస్తానంటూ నమ్మించి తన వెంట రఫీ తీసుకుని వెళ్లాడని ఆయన చెప్పారు. చిన్నారి బాత్రూంకు వెళ్లగా అక్కడే అఘాయిత్యానికి పాల్పడి చంపి శవాన్ని తీసుకుని వెళ్లి నిర్మానుష్యమైన ప్రదేశంలో పడేశాడని చెప్పారు.