తిరుపతి: రాయలసీమలో కాలిఫోర్నియా లాంటి సారవంతమైన నేలలు వున్నాయని... కానీ ఇక్కడ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని జనసేన నేత, మాజీ స్పీకర్  నాదెండ్ల మనోహర్ అన్నారు. కనీసం కోల్డ్ స్టోరేజీలు నిర్మించి రైతులను ఆదుకోలేకపోతున్నాయని అన్నారు. ఇక దళారీ వ్యవస్థను నిర్మూలించలేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. 

కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలిచిన ప్రభుత్వం ప్రజలకు ఉల్లిపాయలు కూడా ఇవ్వలేకపోతోందని విమర్శించారు. కేవలం కూల్చివేతలు, కాంట్రాక్టు రద్దులపై దృష్టిసారించిన ప్రభుత్వం ప్రజల బాగోగులను పట్టించుకోకుండా ఆరునెలల కాలాన్ని వృధా చేసిందన్నారు. 

రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులొచ్చారు కానీ సీమ వెనుకబాటు తనాన్ని రూపుమాపలేకపోయారని... ఇప్పుడు జగన్ కూడా అదే  చేస్తున్నారని అన్నారు. 
రాజకీయ నేతలు వారి స్వప్రయాజనాలకు ఈ వెనుకబాటుతనాన్ని వాడుకుంటున్నారన్నారు.

read more  షాపై పవన్ వ్యాఖ్యలు: విపక్షాల్లో చీలిక, వైసీపీతో గొంతు కలిపిన మిత్రపార్టీ

కియా సంస్థ సిఈఓను కూడా వైసిపి నేతలు వేలు చూపించి బెదిరించి మరీ వెనక్కి పంపించేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల పెట్టుబడిదారులు ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారని అన్నారు.

తెలుగునేలపై పుట్టిన సీఎం జగన్ రెడ్డి తెలుగును పట్టించుకోవాలని అన్నారు. ఇంగ్లీషు అవసరమే కానీ అందుకోసం తెలుగును హరించి వేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆదేశాలు కేవలం తెలుగుకే పరిమితమా లేక ఎపిలో ఉన్న ఉర్ధూ, తమిళం, మరాఠీ, ఒరియా,కన్నడ మీడియాలను కూడా వర్తిస్తాయా వెల్లడించాలని మనోహర్ కోరారు. 

read more బీజేపీకి దగ్గరే .. దూరమయ్యానని ఎవరు చెప్పారు: పవన్ కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... జగన్ నివాసానికి కూతవేటు దూరంలో కృష్ణా పుష్కర ఘాట్ వద్ద సామూహిక మత మార్పిడి జరిగితే ప్రభుత్వానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎవరి అండతో మత మార్పిడులు జరుగుతున్నాయని.. హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన దేవాదాయ శాఖ కానీ, ప్రజాప్రతినిధులు కానీ దీనిపై స్పందించలేదని పవన్ విమర్శించారు.

హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మిగిలిన పార్టీలు సైతం స్పందించడం లేదని.. మిగిలిన మతాల ఓట్లు పోతాయనే వారు మాట్లాడటం లేదని జనసేనాని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఒకవేళ మత మార్పిడులపై స్పందించకుంటే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని పవన్ తెలిపారు.

 వైసీపీ నేతలు భాషను మార్చుకోవాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని స్థానికులు వాపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడితే కానీ ఒక ప్రాంతానికి పెట్టుబడులు రావని, అలాంటిది కియా పరిశ్రమ వస్తే వైసీపీ నాయకులు వాళ్లని బెదిరించారని ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని పవన్ మండిపడ్డారు.

కనీసం నిత్యావర వస్తువుల్లో ఒకటయిన ఉల్లిగడ్డలు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, గత ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే సమయం అంతా వృథా చేస్తున్నారని పవన్ ఎద్దేవా చేశారు. కేజీ ఉల్లిపాయల కోసం 7 నుంచి 8 గంటలు క్యూలో నిలబడాలా అని పవన్ ప్రశ్నించారు. రైతులకు గిడ్డంకులు కట్టాలన్న కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని.. అలాగే ఎంతో కష్టపడితే కానీ ఒక ప్రాంతానికి పెట్టుబడులు రావన్నారు. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పవన్ కల్యాణ్. 

రాయలసీమ యువత మార్పును కోరుకుంటోందని.. తెలుగు భాషను పరిరక్షించండి అంటే వైసీపీ వక్రీకరిస్తోందని జనసేనాని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియం అవసరమే కానీ.. తెలుగు మీడియం లేకుండా చేస్తే ఎలా అని పవన్ ప్రశ్నించారు.

తెలుగు మీడియం తీసుకునే అవకాశం ఉండాలని.. ఉర్దూ మీడియంను కూడా తీసేసి ఇంగ్లీష్ మీడియంను ప్రోత్సహిస్తారా అని పవన్ దుయ్యబట్టారు. ప్రభుత్వం కూల్చివేతలపైనే దృష్టి పెట్టిందని.. ఇంగ్లీష్ మీడియానికి తాను వ్యతిరేకం కాదని, కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన గుర్తు చేశారు.

151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఉల్లి ధరలు తగ్గించలేకపోయారని, ప్రజలకు మాణిక్యాలు అవసరం లేదని.. నిత్యావసరాలు ఇస్తే చాలని పవన్ హితవు పలికారు. యురేనియం మైనింగ్ కారణంగా కడప జిల్లా తుమ్మలపల్లి ప్రాంతంలోని ప్రజలకు అనేక జబ్బులు వచ్చాయని పవన్ గుర్తుచేశారు.