మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులకు స్మార్ట్ సేవలందించేందుకు అనేక ఆధునిక ఉత్పత్తులు ఇప్పుడు ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు ఇతర వస్తువులు ఇప్పటికే ఉండగా, గత కొద్ది కాలం నుంచే అమెజాన్ అలెక్సా లాంటి పరికరాలు  కూడా ఇల్లు చేరిపోయింది.

మనం వాటిని సరైన మార్గంలో వినియోగిస్తేనే అవి మనకు ప్రయోజనాలుంటాయి. లేదంటే ఏదో రకమైన నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందుకే స్మార్ట్ వస్తువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనకు స్మార్ట్ సేవలందించేందుకు ఇంట్లోకి వచ్చిన అలెక్సాతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. 

అవసరం ఉంటేనే..

మొదట అలెక్సా అసిస్టెంట్‌ను సెటప్ చేసే క్రమంలో ఫోన్లో కాంటాక్టులను సింక్ చేయమని అడుగుతుంది. మీరు ఒక వేళ అసిస్టెంట్‌తో ఫోన్ కాల్స్ మాట్లాడకుంటే సింక్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో అసిస్టెంట్ చేసే వాయిస్ రికార్డింగ్స్ పొరబాటున కూడా కాంటాక్టులకు చేరే అవకాశాలు ఉండవు. ఒకవేళ అప్పటికే కాంట్రాక్టులను అలెక్సాకి జత చేస్తే అమెజాన్ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి సింక్ అయిన అడ్రస్ బుక్‌ను తొలగించవచ్చు. 

 ‘డ్రాప్‌ ఇన్‌’తో జాగ్రత్త

ఒకే ఇంట్లో రెండు మూడు అలెక్సా పరికరాలుంటే ఇంటర్‌కామ్ వాడుకుని మాట్లాడుకోవచ్చు. అందుకు అనుమతి ఇచ్చేదే ‘డ్రాప్ ఇన్’ ఆప్షన్. దీంతో హాలులో ఉన్నవారితో గదిలో ఉన్నవారు మాట్లాడుకోవచ్చు. అంతేగాక, ఇంట్లో ఉన్నవారు ఏం మాట్లాడుకుంటున్నారో ఆఫీస్ నుంచి కూడా వినవచ్చు. అలెక్సాలోని స్పీకర్, మైక్ రెండింటినీ యాక్సెస్ చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అందుకే వీటిని ఎప్పుడూ ఎనేబుల్ చేసి ఉంచడం మంచిది కాదనే చెప్పాలి. అంతేగాక, హాకర్ల నియంత్రణలోకి వెళితే మరింత ప్రమాదం. అందుకే అవసరం లేనప్పుడు ‘డ్రాప్ ఇన్’ యాక్సెస్‌ని డిసేబుల్ చేయడం మంచిది. 

పాస్‌వర్డ్ కీలకం

హ్యాకర్లు కనిపెట్టేందుకు అవకాశం లేని స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను మనం వాడుతున్న వైఫై, అమెజాన్‌లకు పెట్టుకోవాలి. అలెక్సా అమెజాన్ సర్వీసుల్లో భాగంగా కావడం వల్ల మీకు ఉన్న అమెజాన్ అకౌంట్‌లోనే అలెక్సా భాగమవుతుంది. అమెజాన్ ప్రైమ్, ఆడిబుల్, అమెజాన్ ఫొటోలు, కిండిల్ లాంటి మరిన్ని సర్వీసులు అమెజాన్ అకౌంట్‌తోనే యాక్సెస్ చేయవచ్చు. అందువల్ల పాస్‌వర్డ్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. 

కొనుగోళ్ల విషయానికొస్తే..

మనం ఏదైనా ఆర్డర్ చేస్తే.. అమెజాన్ ఆన్‌‌లైన్ స్టోర్‌ నుంచి అలెక్సా కొనేస్తుంది. అందుకు ఇన్‌బిల్ట్‌గా ‘వాయిస్ ఆర్డరింగ్’ కమాండ్ ఉంటుంది. దీన్ని డిఫాల్ట్‌గా ఎనేబుల్ చేసి ఉంచితే ఎవరైనా అలెక్సాని అడిగి ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు ఏదైనా సరదాగా చెప్పినా ఆర్డర్ ప్రాసెసింగ్ అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వాయిస్ ఆర్డర్‌ని అవసరం లేనప్పుడు టర్న్ ఆఫ్ చేసి ఉంచడం మంచింది. లేదంటే ఏదైనా పిన్ నెంబర్ పెట్టుకోవచ్చు.

అలా చేయకుంటే వివాదాలే..

అలెక్సా మన ఇంట్లో ఉంటే మనం మాట్లాడుకునే ప్రతీ విషయాన్ని గ్రహిస్తుంది. పొరపాటును మనం మాట్లాడుకునే మాటలన్నీ రికార్డై తర్వాత ఎప్పుడైనా వదిలితే.. అవి వివాదాలకు కూడా దారితీసే అవకాశం లేకపోలేదు. అందుకే అవసరం లేనప్పుడు అలెక్సా చెవులను టర్న్ ఆఫ్ చేసుకుంటే బెటర్.

హిస్టరీ మంచిదే కానీ..

అలెక్సా మనకు అవసరం ఉన్నవి, లేనివి అన్ని రికార్డవుతాయి. కాబట్టి మనకు అవసరం లేని హిస్టరీ రికార్డింగ్స్‌ను ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవడం మంచిది. అయితే, అమెజాన్ సూచనల ప్రకారం హిస్టరీని డిలీట్ చేస్తే అలెక్సాని స్మార్ట్‌గా వాడుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే హిస్టరీ ఆధారంగానే మన అభిరుచులు, అలవాట్లను గ్రహించి అలెక్సా వేగంగా స్పందించే వీలుంటుంది. అందుకే అవసరం లేని హిస్టరీని తొలగించి, అవసరమైన హిస్టరీని ఉండేలా చూసుకోవడం మంచిది. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ స్మార్ట్ పరికరాలను వాడుకుంటే అంతా స్మార్ట్‌గానే ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు.