సాధారణంగా మనం వంటలను ఎక్కువశాతం అల్యూమినియం పాత్రాల్లోనే చేస్తుంటాం. వీటిలో చేస్తే వంటకాలు రుచిగా ఉంటాయని చాలామంది చెబుతుంటారు. అయితే అల్యూమినియం పాత్రలను ఎక్కువకాలం వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇక్కడ చూద్దాం. 

సాధారణంగా ఎవరి వంటగదిలోనైనా ఎక్కువగా కనిపించేవి స్టీల్, అల్యూమినియం పాత్రలు. ఇతర పాత్రలతో పోలిస్తే వీటి ధర తక్కువగా ఉంటుంది కాబట్టి… చాలామంది అల్యూమినియం పాత్రలను కొనుగోలు చేస్తుంటారు. కానీ చాలా సంవత్సరాలు ఒకే పాత్రను వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ పాత్రలకు కూడా ఎక్స్ పైరి డేట్ ఉంటుందని చెబుతున్నారు. మరి అల్యూమినియం పాత్రలను ఎన్ని రోజులు వాడాలి? ఎప్పుడు మార్చాలి.. వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

అల్యూమినియం పాత్రలను ఎప్పుడు మార్చాలి?

ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో నియంత్రణ సంస్థలు, తయారీదారులు అల్యూమినియం పాత్రల గడువు త్వరగా ముగుస్తుందని తెలిపారు. వాటి వాడకం.. నాణ్యతను బట్టి ప్రతి 12 నుంచి 24 నెలలకు ఒకసారి మార్చాలని వారు సూచించారు.

సవరించిన BIS ప్రమాణాల ప్రకారం.. వంట పాత్రల్లో సీసం, కాడ్మియం, పాదరసం, హెక్సావాలెంట్ క్రోమియం వంటి విష లోహాల మూలకం 0.05% కంటే తక్కువగా ఉండాలి.

నిపుణుల ప్రకారం.. రెండేళ్లు దాటిన పాత్రల్లో వంట చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. "అల్యూమినియం మెత్తటి లోహం. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువ కాలం వాడితే.. బరువైన పాత్రలు కూడా త్వరగా పాడైపోతాయి. 

సాధారణంగా తేలికైన అల్యూమినియం పాత్రలు ఒక సంవత్సరం వరకు మాత్రమే ఉంటాయి. మధ్యస్థ, బరువైనవి రెండు సంవత్సరాల వరకు ఉండొచ్చు" అని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం చాలామంది వినియోగదారులు అల్యూమినియం పాత్రలను జీవితాంతం వాడాలనుకుంటున్నారు. కానీ వాటిని 12 నుంచి 20 నెలల వరకే వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కొంతమంది అల్యూమినియం పాత్రల తయారీదారులు.. పాత్రలను నాణ్యంగా తయారుచేయరు. పాత్ర తయారు చేసిన మొదటి సంవత్సరం తర్వాత నుంచి పాత్రల్లో పూతలు ఊడిపోతుంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి వినియోగదారులు అలాంటి పాత్రలను గుర్తించి.. త్వరగా మార్చుకోవాల్సి ఉంటుంది.

శుద్ధ అల్యూమినియం ‘గ్రేడ్ 19000’. ఇందులో 99% అల్యూమినియం ఉంటుంది. '63540' లేదా '60342' వంటి ఇతర గ్రేడ్‌లు మిశ్రమ లోహాలు. ఇవి గట్టిగా ఉంటాయి. కానీ ఇతర మూలకాలతో కలిసి ఉంటాయని BIS వివరించింది. 

ఎవరైనా సరే.. మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ మనం ఇంట్లో రెగ్యులర్ గా వాడే ఈ వంట పాత్రల ద్వారా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని తెలుస్తోంది కాబట్టి... నాణ్యమైన పాత్రలను ఎంచుకోవడం మంచిది.