ధరణి పోర్టల్‌లోని సమస్యలు ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. భూముల కోసం హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయంటూ ఆమె మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ''ధరణి భూ సమస్యల పరిష్కారానికి మంత్రదండం అని చెప్పుకున్న కేసీఆర్ గారు, ఉన్న సమస్య పరిష్కారమేమో కానీ లేని సమస్యలను సృష్టించారు. భూమి ఉన్నోళ్లకు లేనట్టు, లేనోళ్లకు ఉన్నట్టు చూపెడుతూ యజమానులకు లేని పంచాయితీ మోపు చేశారంటూ ట్వీట్ చేశారు.
భూమి కోసం అధికారుల చుట్టూ తిరగలేక లంచాలు ఇచ్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుని కొందరు చనిపోతే, కాస్తు కాలాన్ని ఎత్తేస్తే పాత పేర్ల మీద రికార్డులు చూపటంతో ఆ భూముల కోసం హత్యలు చేసుకుంటున్నారు. లోపాలు ఉన్నాయని మీరే ఒప్పుకొన్నా వాటిని పరిష్కరిస్తే మీ పనికిమాలిన పని ఈ ధరణి (dharani portal) అని తేలిపోతుందని భయపడుతున్నారా? మీ తప్పుని సరిదిద్దుకొని ధరణి పంచాయితీలు తెంపండి'' అని షర్మిల విమర్శలు చేశారు.
ఇకపోతే. వైఎస్ షర్మిల (YS Sharmila) నాయకత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన సంగతి తెలిసిందే. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖను పంపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో నమోదు చేయడానికి దరఖాస్తుదారు వార్తాపత్రికలలో ప్రచురించిన పబ్లిక్ నోటీసుకు ప్రతిస్పందనగా అభ్యంతరాలు వచ్చాయని.. అయితే అవి సమర్ధించదగినవి కావని కమిషన్ గుర్తించినట్టుగా తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A ప్రకారం Y.S.R. Telangana Party రిజిస్ట్రేషన్ పూర్తి అయిందని తెలిపింది. ఇది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టుగా పేర్కొంది.
దివంగత రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎష్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది వైఎస్సార్ జయంతి రోజున షర్మిల తన పార్టీ పేరును, జెండాను ప్రకటించారు. షర్మిలకు ఆమె తల్లి విజయమ్మ తోడుగా నిలిచారు. ఈ క్రమంలో తెలంగాణ అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా వైఎస్ షర్మిల అడుగులు వేస్తున్నారు.
తండ్రి వైఎస్సార్ మాదిరిగానే వైఎస్ షర్మిల కూడా ప్రజా ప్రస్థానం పేరుతో ప్రజ సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టారు. అలాగే నిరుద్యోగ నిరహార దీక్ష, రైతు వేదన దీక్ష కూడా షర్మిల శ్రీకారం చుట్టింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. అయితే షర్మిల మాత్రం అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్నిటార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉన్నారు.
