అదే మాట నేనంటే తల ఎక్కడ పెట్టుకుంటావ్ : మంత్రి సత్యవతి రాథోడ్‌కు షర్మిల కౌంటర్
తనపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. పదవికి తగ్గట్లుగా హుందాగా వుండాలని , ఆమె అన్న మాటను తాను కూడా అంటే తల ఎక్కడ పెట్టుకుంటారని షర్మిల ఫైర్ అయ్యారు.
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. లోటస్ పాండ్ వద్ద నిరాహార దీక్షకు దిగిన ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ... షర్మిల తనను శిఖండి అని అన్నారని, అదే తాను శూర్పణఖ అంటే సత్యవతి మొహం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్న సత్యవతి రాథోడ్.. ఏనాడైనా పోడు భూముల కోసం , ఆదివాసీల కోసం మాట్లాడారా అని షర్మిల నిలదీశారు. మరియమ్మ అనే ఒక ఎస్సీ మహిళ జైల్లోనే చనిపోయినా స్పందించలేదని ఆమె ఫైర్ అయ్యారు.
అలాంటి సత్యవతి తనను శిఖండి అంటుంటుదా అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవికి తగ్గట్లుగా హుందాగా వుండాలని ఆమె చురకలంటించారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా షర్మిల విమర్శలు చేశారు. మీరు, మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు.. కానీ తాము మాత్రం నిరాహారదీక్షలు చేసుకోకూడదా అని ఆమె ప్రశ్నించారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా.. కేసీఆర్ న్యాయస్థానానికి గౌరవం ఇవ్వడం లేదని షర్మిల మండిపడ్డారు. అరెస్ట్ అయిన వైఎస్సార్‌టీపీ కార్యకర్తలను విడుదల చేసేంత వరకు , పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆమె తేల్చిచెప్పారు.
ALso REad:మరోసారి వైఎస్ షర్మిల అరెస్ట్.. ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత
ఇకపోతే.. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీ నుండి నర్సంపేట నియోజకవర్గంలోని లింగగిరి నుండి పాదయాత్రను పున: ప్రారంభించాలని వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు కూడా షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. అయితే పాదయాత్రకు సంబంధించి వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. డిసెంబర్ 3వ తేదీన పాదయాత్రకు అనుమతిపై వైఎస్ఆర్‌టీపీ నేతలు దరఖాస్తు చేశారు. అదే రోజు రాత్రి పోలీసులు వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతిని నిరాకరించారు.