మరోసారి వైఎస్ షర్మిల అరెస్ట్.. ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద వున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ దీక్షకు దిగారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్యాంక్ బండ్‌పై వున్న అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి లోటస్ పాండ్‌కు తరలించారు పోలీసులు.
ఇకపోతే.. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీ నుండి నర్సంపేట నియోజకవర్గంలోని లింగగిరి నుండి పాదయాత్రను పున: ప్రారంభించాలని వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు కూడా షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. అయితే పాదయాత్రకు సంబంధించి వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. డిసెంబర్ 3వ తేదీన పాదయాత్రకు అనుమతిపై వైఎస్ఆర్‌టీపీ నేతలు దరఖాస్తు చేశారు. అదే రోజు రాత్రి పోలీసులు వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతిని నిరాకరించారు.
Also REad:పాదయాత్రకు వరంగల్ పోలీసుల అనుమతి నిరాకరణ: భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో షర్మిల చర్చలు
గతంలో పాదయాత్రకు అనుమతిని ఇస్తే జిల్లాలో ఉద్రిక్తతలకు కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. మరోసారి పాదయాత్రకు అనుమతిస్తే శాంతిభద్రతల సమస్యల తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయమై వైఎస్ఆర్‌టీపీకి డిసెంబర్ మూడో తేదీ రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో డిసెంబర్ 4వ తేదీన ప్రారంబించాల్సిన పాదయాత్ర వాయిదా పడింది.
నవంబర్ 27న నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నవంబర్ 28న టీఆర్ఎస్ శ్రేణుల నిరసనల మధ్య షర్మిల పాదయాత్ర సాగింది. లింగగిరికి సమీపంలో షర్మిల బస చేసే బస్సుకు టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టే ప్రయత్నం చేశాయి. వైఎస్ఆర్‌టీపీ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో నర్సంపేట నుండి షర్మిలను పోలీసులు హైద్రాబాద్ కు తరలించారు. నర్సంపేటలో ధ్వంసమైన తమ వాహనాలతో ప్రగతి భవన్ వద్ద ధర్నాకు వెళ్లిన షర్మిలను పంజాగుట్ట నుండి క్రేన్ సహాయంతోనే పోలీసులు లిఫ్ట్ చేశారు. పంజాగుట్ట నుండి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.