పాదయాత్రకు వరంగల్ పోలీసుల అనుమతి నిరాకరణ: భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో షర్మిల చర్చలు

వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.ఈ విషయమై  పార్టీ నేతలతో  షర్మిల చర్చించనున్నారు.
 

Warangal Police denies permission to YSRTP Chief YS Sharmila Praja Prasthanam Padayatra

హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.  ఈ  నెల 4వ తేదీ నుండి  నర్సంపేట నియోజకవర్గంలోని  లింగగిరి నుండి  పాదయాత్రను పున: ప్రారంభించాలని  వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు కూడా షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. అయితే  పాదయాత్రకు  సంబంధించి వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. డిసెంబర్  3వ తేదీన పాదయాత్రకు అనుమతిపై  వైఎస్ఆర్‌టీపీ ధరఖాస్తు చేశారు.డిసెంబర్  3వ తేదీ రాత్రి పోలీసులు  వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతిని  నిరాకరించారు. గతంలో  పాదయాత్రకు  అనుమతిని ఇస్తే  జిల్లాలో  ఉద్రిక్తతలకు  కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. మరోసారి  పాదయాత్రకు అనుమతిస్తే శాంతిభద్రతల సమస్యల తలెత్తే అవకాశం ఉందని  పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.ఇదే విషయమై వైఎస్ఆర్‌టీపీకి  డిసెంబర్  మూడో తేదీ రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో  డిసెంబర్ 4వ తేదీన  ప్రారంబించాల్సిన  పాదయాత్ర  వాయిదా పడింది.  డిసెంబర్ 4వ తేదీ రాత్రి  వైఎస్ఆర్ టీపీ  నేతలు  వరంగల్ పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చారు. వైఎస్ఆర్ టీపీ సమాధానంతో వరంగల్ పోలీసులు సంతృప్తి చెందలేదు.  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ షర్మిల పాదయాత్రకు అనుమతిని ఇవ్వలేదు.  దీంతో  ఏం చేయాలనే దానిపై  షర్మిల పార్టీ నేతలతో  చర్చించనున్నారు.

ఈ ఏడాది నవంబర్  27న నర్సంపేట నియోజకవర్గంలో  నిర్వహించిన సభలో  స్థానిక ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్ రెడ్డిపై  షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు క్షమాపణలు చెప్పాలని  టీఆర్ఎస్ డిమాండ్  చేసింది.  నవంబర్  28న టీఆర్ఎస్ శ్రేణుల నిరసనల మధ్య షర్మిల పాదయాత్ర సాగింది.  లింగగిరికి సమీపంలో షర్మిల బస చేసే బస్సును టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టే ప్రయత్నం చేశాయి. వైఎస్ఆర్‌టీపీ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో నర్సంపేట నుండి  షర్మిలను పోలీసులు హైద్రాబాద్ కు తరలించారు. నర్సంపేటలో ధ్వంసమైన తమ వాహనాలతో  ప్రగతి భవన్ వద్ద  ధర్నాకు వెళ్లిన షర్మిలను పంజాగుట్ట నుండి క్రేన్ సహాయంతోనే  పోలీసులు లిఫ్ట్  చేశారు.  పంజాగుట్ట నుండి  ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

also read:వైఎస్ షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసుల అనుమతి నిరాకరణ : ప్రజా ప్రస్థానానికి బ్రేక్

నవంబర్  28న పాదయాత్రకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో  వైఎస్ఆర్‌టీపీ నేత  రవీంద్రనాథ్ రెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన  హైకోర్టు  షర్మిల పాదయాత్రకు అనుమతిని ఇచ్చింది.హైకోర్టు  అనుమతిని ఇచ్చినా  పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంపై  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ షర్మిల  పార్టీ నేతలతో సమాలోచనలు నిర్వహించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios