వైఎస్ షర్మిలకు షాక్.. బీఆర్ఎస్‌లో చేరనున్న ఏపూరి సోమన్న..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్న వేళ.. వైఎస్సార్‌టీపీ చెందిన కీలక నేత పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్న వేళ.. వైఎస్సార్‌టీపీ చెందిన కీలక నేత పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. వైఎస్సార్‌టీపీ నేత, ప్రముఖ జానపద గాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఈ క్రమంలోనే ఏపూరి సోమన్న శుక్రవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీర్ఎస్‌లో చేరాలనే కోరికను సోమన్న వ్యక్తం చేశారు. దీంతో సోమన్నను బీఆర్ఎస్‌లో చేరాల్సిందిగా మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నేత దాసోజు శ్రవణ్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఇక, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సోమన్న చురుకైన పాత్ర పోషించారు. బడుగు బలహీన వర్గాల బలమైన గొంతుకగా ప్రజాదరణ పొందారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తన పాటల ద్వారా భారీ మద్దతు కూడగట్టడంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన సేవలను గౌరవించింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో సోమన్న.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2021 మార్చిలో వైఎస్సార్‌టీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనానికి సంబంధించిన చర్చలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో.. సోమన్న బీఆర్ఎస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.