తెెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. 

హైదరాబాద్ : నిరుద్యోగ యువతను ఇప్పుడే కాదు ఉద్యమకాలంనుండి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో గ్రూప్-1 పరీక్షలు రాయొద్దంటూ నిరుద్యోగులను రెచ్చగొట్టాడని అన్నారు. ప్రత్యేక తెలంగాణలోనే పోటీ పరీక్షలు రాసుకుందామని యువతను పెడదోవ పట్టించిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు. స్వరాష్ట్రంలో పరీక్షలు రాద్దామని చెప్పిన కేసీఆరే గత తొమ్మిదేండ్లుగా తెలంగాణను పాలిస్తున్నాడు... ఈ కాలంలో కనీసం ఒక్క గ్రూప్-1 ఉద్యోగమైనా ఇచ్చాడా..? అని షర్మిల నిలదీసారు. 

తెలంగాణ ఏర్పాటు తర్వాత భారీ ఉద్యోగ ప్రకటనలు వుంటాయని... కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న యువత ఆశలపై కేసీఆర్ సర్కార్ నీళ్లు చల్లిందని షర్మిల అన్నారు. ఉద్యోగాలు రాక బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే... కడుపుకోతతో బాధపడుతున్న తల్లిదండ్రులను సీఎం కనీసం పరామర్శించలేదని అన్నారు. ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి అని కేసీఆర్ యువతను వంచించాడని షర్మిల మండిపడ్డారు. 

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక నిజమో కాదో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు షర్మిల. దేశంలో ఎంప్లాయిమెంట్ పాలసీ తీసుకురావాలంటున్న చిన్న దొర కేటీఆర్ ముందు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలని షర్మిల డిమాండ్ చేసారు.

Read More మతం హింసకు వ్యతిరేకం.. మతాన్ని విశ్వసించేవారు మత మౌఢ్యాన్ని కోరుకోరు: సీఎం కేసీఆర్

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకోసం రూపొందించిన ప్రశ్నాపత్రాలకు డిజిటల్ సెక్యూరిటీ కల్పించకపోవడం ఐటీ మంత్రి వైఫల్యమేనని షర్మిల అన్నారు. తండ్రి కేటీఆర్ యువతను బలిపశువులను చేస్తే కొడుకు కేటీఆర్ అదే యువత ఉద్యోగ ఆకాంక్షలను పాతరేసారని అన్నారు. తండ్రీ కొడుకుకు సిగ్గుంటే ముక్కునేలకు రాసి యువతకు క్షమాపణ చెప్పాలన్నారు షర్మిల. 

ఇదిలావుంటే ఇటీవల సీఎం కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా మహారాష్ట్ర యువకుడు శరద్ మర్కద్‌ను నియమించడంపై షర్మిల ఘాటుగా స్పందించారు. తెలంగాణ సొమ్మేమైనా కేసీఆర్ తాత జాగీరా అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... ముందు వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఇది చేతకాలేదు కానీ పక్క రాష్ట్రానికి చెందిన యువకుడు బిఆర్ఎస్ పార్టీలో చేరగానే రూ.18లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చాడన్నారు. తెలంగాణ సంపద ఏమైనా కేసీఆర్ అత్తగారి సొమ్మా? లేక తెలంగాణ కొలువులు ఏమైనా ఆయన ఇంట్లో
నౌకరు పదవులా? అని అడిగారు. 

'' పేపర్లు లీక్ చేసి అమ్ముకుంటున్నారు? జీవోలు దాచిపెట్టి కొలువులు కట్టబెడుతున్నారు? నీ పార్టీ ఖజానాలో ఉన్న రూ.1250 కోట్లు సరిపోవడం లేదా? ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా నీ పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూస్తున్నావా?ఇలా జీవోలను దాచిపెట్టి ఇంకా ఎంతమందికి కొలువులు ఇచ్చారు? మీ పార్టీ కార్యకర్తలకు పదవుల కోసం ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రాన్ని పాలించాలని ప్రజలు అధికారాన్ని ఇస్తే ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదు'' అంటూ ట్విట్టర్ వేదికన షర్మిల ధ్వజమెత్తారు.