దద్దమ్మ, వెన్నుపోటుదారు, దోపిడీదారు, తాలిబన్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల ధ్వజమెత్తారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ సర్కార్ నిర్వహించిన రైతు దినోత్సవంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహించిందని అనే కంటే రైతు దగా దినోత్సవం చేసిందని అంటేనే సరిపోతుందని అన్నారు. ఈ పదేళ్లు రైతులను నిండాముంచిన కేసీఆర్ దొర ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఓట్లకోసమే రైతు దినోత్సవం నిర్వహించారని... కానీ రైతన్నలు చెంప చెల్లుమనిపించేలా సమాధానం చెప్పారన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ, పంట పరిహారం హామీలు ఏమయ్యాయని రైతులు బిఆర్ఎస్ బందిపోట్లను నిలదీస్తున్నారని... అయినా కేసీఆర్ కు సిగ్గనిపించడం లేదంటూ షర్మిల మండిపడ్డారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఏం సాధించారని రైతు దినోత్సవం నిర్వహిస్తున్నరని షర్మిల ప్రశ్నించారు. గత ఎన్నికల్లో లక్ష రూపాయల లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తానని నమ్మించాడని... మళ్లీ ఎన్నికలు వస్తున్నా ఇప్పటివరకు ఈ హామీ అమలు కాలేదని అన్నారు. ఇలా 31లక్షల మంది రైతులను మోసం చేసినందుకు రైతు దినోత్సవం జరుపారా అంటూ షర్మిల ఎద్దేవా చేసారు. 

ఇక ప్రతి ఏడాది 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి దగా చేసారని షర్మిల అన్నారు. అలాగే పంట నష్టపరిహారంకు దిక్కు లేదు, పంట బీమాకు మోక్షం లేదని అన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ తొమ్మిదేళ్లలో 9వేల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.ఇలా రైతులను పొట్టనపెట్టుకున్నందుకే రైతు దినోత్సవం నిర్వహించారా అంటూ షర్మిల నిలదీసారు. 

Read More పొంగులేటి మా పార్టీలోకి రావాలి.. గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి: కేఏ పాల్

''ఎకరాకు ముష్టి రూ.5వేల రైతుబంధు ఇచ్చి.. ఇన్ పుట్ సబ్సిడీ, రాయితీ ఎరువులు, విత్తనాలు, యంత్ర లక్ష్మి వంటి రూ.30వేల రైతు పథకాలను బొంద పెట్టాడు. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రూ.కోట్లు చెల్లించి దర్జాగా మేపుతున్నాడు. ప్రతీ ఎకరాకు నీళ్లు ఇస్తానని చెప్పి కాళేశ్వరం పేరుతో రూ.1.21లక్షల కోట్ల అప్పు తెచ్చి, కమీషన్లు దోచుకున్నాడు. పాత ప్రాజెక్టులను పాతరేసి, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయని చేతకాని దద్దమ్మ కేసీఆర్. వరి వేస్తే ఉరేనని, కౌలు రైతు రైతే కాదని భయభ్రాంతులకు గురి చేసి రైతుల ప్రాణం తీశాడు. రైతు బీమా పథకాన్ని 60 ఏండ్లకే పరిమితం చేసి, రైతులకు వెన్నుపోటు పొడిచాడు'' అంటూ షర్మిల మండిపడ్డారు. 

''రైతులు పండించిన వడ్లను కొనకుండా ముప్పుతిప్పలు పెట్టి, కల్లాల్లోనే రైతుల గుండెలు ఆగేలా చేశాడు. మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నా, అగ్గువకే వడ్లు కొంటున్నా దొరికినంతా దోచుకోండని చెప్పిన దోపిడీదారుడు కేసీఆర్. వ్యవసాయం అంటే మహానేత వైయస్ఆర్ కాలంలో పండుగ.. ఇప్పుడు తాలిబాన్ కేసీఆర్ కాలంలో దండగ. బిఆర్ఎస్ అంటే కిసాన్ సర్కార్ కాదు.. కిసాన్ ను నిండా ముంచే సర్కారు'' అంటూ ఎద్దేవా చేసారు. 

''రైతులను అప్పులపాలు చేసి, ఆత్మహత్యల బాట పట్టిస్తున్న కేసీఆర్ కి బుద్ది చెప్పేది రైతులే. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కి గడ్డి తినిపించేది రైతులే.ఇప్పటికైనా రైతులు పరిహారమే వద్దన్నారని సొల్లు కబుర్లు చెప్పకుండా వారం రోజుల్లో 15 లక్షల ఎకరాల్లో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి. మిగిలిపోయిన 30 లక్షల టన్నుల ధాన్యం వెంటనే కొనాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది'' అంటూ షర్మిల ట్వీట్ చేసారు.