కాంగ్రెస్‌కు వైఎస్ఆర్‌టీపీ మద్దతు, పోటీకి దూరం: వైఎస్ షర్మిల కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక నిర్ణయాన్ని ప్రకటించారు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని వైఎస్ఆర్‌టీపీ నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల శుక్రవారంనాడు తేల్చి చెప్పారు.శుక్రవారంనాడు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైఎస్ షర్మిల ఇవాళ మీడియాకు వివరించారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నామని వైఎస్ షర్మిల ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భేషరతుగా మద్దతు ఇస్తున్నట్టుగా వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అవకాశాలకు అడ్డుపడకూడదనే ఉద్దేశ్యంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వైఎస్ షర్మిల తెలిపారు.ప్రభుత్వం మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అవినీతి పాలనను అడ్డుకొనేందుకు కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా షర్మిల వివరించారు.ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులను బరిలోకి దింపి కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయడం ఇష్టం లేదన్నారు.
also read:సోనియాతో భేటీ: షర్మిలకు కాంగ్రెస్ రెండు ఆఫ్షన్లు?
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. సోనియా, రాహుల్ గాంధీలు తనతో ఆప్యాయంగా మాట్లాడారన్నారు. అంతేకాదు తమ కుటుంబంగా తనతో సోనియా, రాహుల్ గాంధీ చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 12న లోటస్ పాండ్ లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనం వాయిదా పడడంతో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 31న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయమై చర్చించారు. వైఎస్ షర్మిల సేవలను తెలంగాణ ఉపయోగించుకుంటే రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ కు నష్టమని కొందరు వాదించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా వేదికగా కూడ వ్యాఖ్యలు చేశారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం షర్మిల తెలంగాణలో ప్రచారం చేస్తే నష్టం ఉండదని వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల సేవలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నేతలు సూచించారు.ఈ నేపథ్యంలో వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ లో విలీనం వాయిదా పడింది. దరిమిలా ఒంటరి పోరు చేయాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు.
also read:పాలేరు నుండి బరిలోకి: నవంబర్ 4న వైఎస్ షర్మిల నామినేషన్
అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని షర్మిలను కొందరు కాంగ్రెస్ నాయకులు కోరారని సమాచారం. గత నెల 31న ప్రియాంక గాంధీతో షర్మిల చర్చలు జరపాల్సి ఉంది. అనారోగ్య కారణాలతో ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. దీంతో ఈ చర్చలు జరగలేదు. ఈ తరుణంలో కొందరు కాంగ్రెస్ నేతలు షర్మిల చర్చలు జరిపినట్టుగా సమాచారం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.