కబ్జాకోరు: ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైఎస్ షర్మిల ఫైర్
మహిళలంటే కేసీఆర్ కి చిన్న చూపు అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
హైదరాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జాకోరు అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.మహబూబాబద్ లో వైఎస్ షర్మిలను ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ నుండి హైద్రాబాద్ లోటస్ పాండ్ కి తీసుకు వచ్చారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై విమర్శలు చేయడంతో షర్మిల పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు పోలీసులు.
ఇవాళ హైద్రాబాద్ లోటస్ పాండ్ లో షర్మిల మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అభ్యంతరకరంగా మాట్లాడారని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ ఉపయోగించిన భాషపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్లంటే తప్పు లేదా ? మేమంటేనే తప్పుందా అని షర్మిల ప్రశ్నించారు. మహిళలంటే ఇంత చిన్నచూపా అని షర్మిల అడిగారు. మహిళ అని కూడా చూడకుండా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ మహిళలకు ఏ మేరకు గౌరవం ఇస్తుందో దీన్ని బట్టి తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలు బెదిరింపు ధోరణిని మానుకోవాలని ఆమె కోరారు.
గతంలో కూడ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్‌టీపీకి చెందిన వాహనాలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు
also read:వైఎస్ షర్మిల అరెస్ట్.. పాదయాత్రకు అనుమతి రద్దు..
పోలీసులు పాదయాత్రకు అనుమతిని ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతిని తీసుకున్నారు. అయితే పాదయాత్రలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు షర్మిల పార్టీకి సూచనలు చేసింది. ఈ సూచనల ఆధారంగా షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు.