తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్  లను పెద్ద దొర, చిన్న దొర అని సంబోధిస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

హైదరాబాద్: తెలంగాణలో రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై వెైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysr telangana party) అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. అన్నదాతలు అప్పులబాధతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని నియంత్రించాల్సింది పోయి పెద్దదొర, చిన్నదొర రాజకీయాలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికన రైతు ఆత్మహత్యలపై స్పందిస్తూ సీఎం కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్ (KTR) పై షర్మిల విరుచుకుపడ్డారు. 

''చిన్నదొర గారి సొంత నియోజకవర్గంలో అప్పులపాలైన రైతు ఆత్మహత్య చేసుకుండు. చేనేత మంత్రిగారు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పులపాలై చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అయినా మంత్రి కేటీఆర్ గారు ఆదుకోవాల్సింది పోయి గత్తర రాజకీయాలు, ట్విట్టర్ యుద్ధాలు చేస్తున్నారు తప్పితే అయ్యో అనడానికి నోరు మెదపటం లేదు. సాయమందించటానికి చెయ్యి రావటం లేదు'' అంటూ షర్మిల ట్వీట్ చేసారు. 

''పంట పెట్టుబడికి అప్పు తెచ్చి, సాగు నీటికోసం బోర్ల మీద బోర్లు వేసి చుక్క నీళ్లు పడక, కండ్లనుంచి నీటి ధార ఆగక తెచ్చిన అప్పులు తీర్చలేక గోవర్ధన్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే, చేనేత మగ్గం నడువక, బతుకు బండి బిడ్డ పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక చేనేత కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం భారమైపోయింది. నేతన్నల కష్టానికి ఫలితం కరువైంది. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోని పెద్ద దొర, చిన్న దొర దేశాన్ని ఏలపోవడానికి తెలంగాణ బిడ్డలను గాలికొదిలేస్తున్నారు'' అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు.

అంతకుముందు భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపైనా ఇదే ట్విట్టర్ వేదికన షర్మిల స్పందించారు. ''భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ మోడీ గారిని కడుగుతా, తోముతా, దేశంలో భూకంపం తెప్పిస్త అన్న దొరగారు... మోడీ హైదరాబాద్ కు వస్తే ఎందుకు కలవలేదు? బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని మోడీకి ఎదురుపడి ఎందుకు అడుగలేదు?'' అని నిలదీసారు. 

''బండ బూతులు తిట్టిన నోటితో బాగున్నారా అని అడుగలేక పోయారా? చీరుతా అన్న చేతులతో నమస్కారం పెట్టలేకపోయారా? పోయినుంటే మోడీ, కేసీఆర్ ఢిల్లీ దోస్తానీ మరోసారి బయటపడుతదని పోలేదా? అందుకే జ్వరం వంక పెట్టుకొని డుమ్మా కొట్టారా? సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణకు పోని పాపాన్ని కడుక్కోవటానికి యాదాద్రి యాగానికి వెళ్ళారా? బాగుంది దొరగారు మీ జ్వర రాజకీయం'' అంటూ షర్మిల ఎద్దేవా చేసారు. 

రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ది లేదని షర్మిల విమర్శించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. రైతుల కష్టాలు కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. కొందరు రైతులకు పంట భీమా కూడ అందని పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీఎంగా వైఎస్సార్ ఉన్న సమయంలో రైతుల పరిస్థితి ఇలానే ఉందా అని ఆమె ప్రశ్నించారు. రైతుల పెట్టుబడి తగ్గించి రాబడి ఎక్కువ వచ్చేలా చర్యలు తీసుకొన్న విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. రైతులను అప్పట్లో వైఎస్ఆర్ సర్కార్ రైతులను అన్ని రకాలుగా ఆదుకోలేదా అని షర్మిల కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నించారు.