Asianet News TeluguAsianet News Telugu

షర్మిల అరెస్ట్.. ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు బయల్దేరేందుకు యత్నం, వైఎస్ విజయమ్మ గృహ నిర్బంధం

తన కుమార్తె వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు చేరుకున్నారు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ. ఇదే సమయంలో అక్కడికి భారీగా చేరుకున్న వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు 

ys vijayamma visit sr nagar police station
Author
First Published Nov 29, 2022, 3:27 PM IST

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో షర్మిల వున్నారు. దీంతో ఆమెను పరామర్శించేందుకు షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ ఎస్ఆర్ నగర్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆమెను లోటస్ పాండ్‌లోని ఇంటిలో హౌస్ అరెస్ట్ చేశారు.  మరోవైపు షర్మిల అరెస్ట్ గురించి తెలుసుకున్న వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు, అభిమానులు ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు భారీగా చేరుకుంటున్నారు. 

కాగా... నిన్న నర్సంపేట అసెంబ్లీ  నియోజకవర్గంలోని  లింగగిరిలో  వైఎస్ షర్మిలకు చెందిన  బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. అంతే కాదు  షర్మిల  పార్టీకి  చెందిన వాహనాలపై దాడి చేశారు . ఈ ఘటనలో  నాలుగు వాహానాలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణుల దాడిని  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం  చేశాయి. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో  వైఎస్  షర్మిలను పోలీసులు  అరెస్ట్ చేసి  హైద్రాబాద్ కు తీసుకు వచ్చి రాత్రి లోటస్ పాండ్‌లో వదిలి వెళ్లిపోయారు.  

ALso Read:వైఎస్ఆర్‌టీపీ చీఫ్ నిరసన:పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు

అయితే నర్సంపేటలో టీఆర్ఎస్  శ్రేణుల దాడికి నిరసనగా  ఇవాళ ప్రగతి భవన్ ను ముట్టడించాలని  వైఎస్ఆర్‌టీపీ తలపెట్టింది.    పోలీసుల కళ్లుగప్పి  షర్మిల  లోటస్  పాండ్ నుండి బయటకు వెళ్లారు. సోమాజీగూడ నుండి ధ్వంసమైన  కారుతో  ప్రగతి భవన్ వైపునకు వెళ్లే  ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పంజాగుట్టలో  షర్మిలను అడ్డుకున్నారు. అయితే కారులో నుండి దిగకుండా  ఆమె  నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడా దించలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తర్వాత  కూడా  ఆమె  కారు నుండి దిగలేదు. దీంతో కారు డోర్ లాక్స్ ఓపెన్  చేసి  షర్మిలను  ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకెళ్లారు పోలీసులు. మరోవైపు షర్మిలకు మద్దతుగా  వచ్చిన  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు, షర్మిల అభిమానులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios